ఆమ్లా, మ్యాక్స్వెల్ కుమ్మేశారు..!
ఇండోర్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో మరోసారి పరుగుల మోత మోగింది. గురువారం ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ విశ్వరూపం ప్రదర్శించింది. ప్రధానంగా ముంబై ఇండియన్స్ పై హషీమ్ ఆమ్లా, మ్యాక్స్వెల్ల పిడుగు పడింది. హషీమ్ ఆమ్లా(104 నాటౌట్; 60 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు), మ్యాక్స్ వెల్(40;18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో కింగ్స్ పంజాబ్ 199 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ పంజాబ్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ఆరంభించింది. వికెట్లను కాపాడుకుంటూ సాధారణ రన్ రేట్ తో ముందుకు సాగింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ లో షాన్ మార్ష్(26) తొలి వికెట్ గా అవుట్ కావడంతో కింగ్స్ స్కోరు బోర్డు మరీ నెమ్మదించింది. ఆ క్రమంలోనే 10 ఓవర్లలో కింగ్స్ పంజాబ్ వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. అయితే ఆపై వృద్ధిమాన్ సాహా(11)అవుటైన తరువాత మ్యాక్స్ వెల్ రూపంలో విధ్వంసం మొదలైంది. బౌలర్ ఎవరనేది చూడకుండా బౌండరీల వర్షం కురిపించాడు మ్యాక్స్ వెల్. ప్రధానంగా ఇన్నింగ్స్ 15 ఓవర్ లో మ్యాక్స్ వెల్ ఊచకోతకు గురయ్యాడు మెక్లీన్ గన్.
ఆ ఓవర్ లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్ల సాయంతో 28 పరుగులు పిండుకున్నాడు మ్యాక్స్ వెల్. ఆపై మలింగా వేసిన ఓవర్ లో ఆమ్లా పంజా విసిరాడు. రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో మలింగాకు చుక్కలు చూపించాడు. దాంతో ఆ ఓవర్ లో 22 పరుగులు లభించాయి. అయితే 17 ఓవర్ లో మ్యాక్స్ వెల్ , స్టోనిస్(1) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో కింగ్స్ పంజాబ్ వేగం తగ్గింది. ఇక చివరి ఓవర్ లో ఆమ్లా రెండు వరుస సిక్సర్లతో శతకం సాధించడం ఇక్కడ విశేషం. దాంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లీన్ గన్ కు రెండు వికెట్లు లభించగా, కృణాల్ పాండ్యా, బూమ్రాలకు తలో వికెట్ దక్కింది.