హైదరాబాద్‌పై ఆంధ్ర గెలుపు
రాణించిన విహారి, స్వరూప్
చెన్నై: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 సౌత్‌జోన్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు తమ పోరాటాన్ని విజయంతో ముగించింది. చిరకాల ప్రత్యర్థి హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 11 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. టా‹స్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర 19.2 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ హనుమ విహారి (34 బంతుల్లో 49; 5 ఫోర్లు, ఒక సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఒకదశలో 108/3తో పటిష్టంగా కనిపించిన ఆంధ్ర ఆ తర్వాత 32 పరుగుల తేడాతో 7 వికెట్లు కోల్పోయింది. హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ సరిగ్గా 20 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (32 బంతుల్లో 49; 6 ఫోర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఒకదశలో స్కోరు 85/2తో విజయందిశగా సాగుతున్నట్లు కనిపించినా హైదరాబాద్ జట్టు ఆంధ్ర లెగ్ స్పిన్నర్ దాసరి స్వరూప్ కుమార్ (5/19) మాయాజాలానికి చివరి ఎనిమిది వికెట్లను 44 పరుగులకు కోల్పోయి ఓటమి చవిచూసింది.