సాక్షి, ఒంగోలు: ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆంధ్ర రంజీ క్రికెట్ జట్టు బౌలర్ కేవీ శశికాంత్ తన పేస్ పదును మరోసారి ప్రదర్శించాడు. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. ఫలితంగా ఆంధ్ర జట్టుతో ఇక్కడి సీఎస్‌ఆర్ శర్మ కాలేజీ మైదానంలో మొదలైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకే ఆలౌటైంది. శశికాంత్ 60 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. తన్మయ్, అక్షత్ రెడ్డి, మల్లికార్జున్, సీవీ మిలింద్, హిమాలయ్ అగర్వాల్‌లను శశికాంత్ అవుట్ చేశాడు. మరో బౌలర్ యెర్రా పృద్విరాజ్ మూడు వికెట్లు తీయగా... పైడికాల్వ విజయ్ కుమార్, బండారు అయ్యప్ప ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఈ సీజన్‌లో ఓ ఇన్నింగ్స్‌లో నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం శశికాంత్‌కిది ఐదోసారి. ఇందులో మూడుసార్లు ఐదేసి వికెట్ల చొప్పున, రెండుసార్లు నాలుగేసి వికెట్ల చొప్పున తీశాడు. హైదరాబాద్ జట్టులో జావీద్ అలీ (161 బంతుల్లో 98; 16 ఫోర్లు) తప్ప మిగతా ప్లేయర్లు చేతులెత్తేశారు. జావీద్ రెండు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. అనంతరం ఆంధ్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ (4 బ్యాటింగ్; ఫోరు), ప్రశాంత్ (9 బ్యాటింగ్; ఫోరు) క్రీజులో ఉన్నారు.
విజయ్ రికార్డు...
ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీయడం ద్వారా విజయ్ కుమార్ రంజీల్లో ఆంధ్ర తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. కెరీర్‌లో 71వ రంజీ మ్యాచ్ ఆడుతున్న విజయ్ 243 వికెట్లు తీశాడు. షాబుద్దీన్ (75 మ్యాచ్‌ల్లో 242 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును విజయ్ బద్దలు కొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment