అదరగొట్టిన ఆంధ్ర | Andhra Team Beat Delhi By 9 Wickets | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన ఆంధ్ర

Published Sat, Dec 21 2019 2:55 AM | Last Updated on Sat, Dec 21 2019 2:55 AM

 Andhra Team Beat Delhi By 9 Wickets - Sakshi

స్టీఫెన్, శశికాంత్‌

సాక్షి, ఒంగోలు టౌన్‌: సొంత మైదానంలో ఆంధ్ర జట్టు సత్తా చాటింది. శుక్రవారం ముగిసిన గ్రూప్‌–‘ఎ’ రంజీ క్రికెట్‌ టోర్నమెంట్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన ఆంధ్ర 9 వికెట్ల తేడాతో ఏడు సార్లు రంజీ చాంపియన్‌ అయిన ఢిల్లీని చిత్తు చేసింది. ఆంధ్ర బౌలర్లు శశికాంత్‌ (5/41), స్టీఫెన్‌ (5/91) చెలరేగడంతో ఢిల్లీ తన రెండో ఇన్నింగ్స్‌లో 72.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది 16 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 2.3 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి 20 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్‌ జ్ఞానేశ్వర్‌ (0) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగగా... సారథి హనుమ విహారి (4) త్వరగా అవుట్‌ అయ్యాడు.

మనీశ్‌ (15 నాటౌట్‌; 3 ఫోర్లు), ప్రశాంత్‌ కుమార్‌ (1 నాటౌట్‌) లాంఛనం పూర్తి చేశారు. ఓవర్‌నైట్‌ స్కోరు 89/6తో చివరి రోజు ఆటను కొనసాగించిన ఢిల్లీని లలిత్‌ యాదవ్‌ (145 బంతుల్లో 55; 11 ఫోర్లు), వికాశ్‌ మిశ్రా (151 బంతుల్లో 36; 5 ఫోర్లు) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరు ఏడో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఢిల్లీకి ఇన్నింగ్స్‌ పరాభవాన్ని తప్పించారు. అర్ధ శతకంతో నిలకడగా ఆడుతున్న లలిత్‌ యాదవ్‌ను శశికాంత్‌ పెవిలియన్‌కు పంపగా... వికాశ్‌ మిశ్రాను స్టీఫెన్‌ వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్‌కు తెరపడటానికి ఎంతో సేపు పట్టలేదు. ఈ విజయంతో ఆంధ్ర ఖాతాలో 4 పాయింట్లు చేరాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement