
కోల్‌కతా: టీమిండియాతో ఇక్కడ ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఆదివారం జరుగునున్న తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ ఆడటం అనుమానంగా మారింది. గాయం కారణంగా వన్డేలకు ఎంపిక కాని రస్సెల్.. ఇప్పుడు మొదటి టీ20 మ్యాచ్‌లో ఆడటంపై సందిగ్ధత నెలకొంది. టీ 20ల కోసం ఆలస్యంగా భారత్‌కు వచ్చిన రస్సెల్ ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాలేదు. దాంతో ఆరంభపు టీ20 మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సమాచారం.
టీ20ల కోసం రెండు రోజుల క్రితం కెప్టెన్ బ్రాత్‌వైట్‌తో సహా ఏడుగురు వెస్టిండీస్ క్రికెటర్లు భారత్‌కి వచ్చారు. అయితే వారితో కలిసి విమానంలో రాని రస్సెల్ దుబాయ్ మీదుగా.. ఈరోజు భారత్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన వెస్టిండీస్ ప్రాక్టీస్ సెషన్‌లో అతను పాల్గొనలేకపోయాడు.
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున మ్యాచ్‌లు ఆడిన రస్సెల్‌కు ఈడెన్ గార్డెన్స్ మైదానం కొట్టినపిండి. దాంతో తొలి టీ20లో అతను జట్టుకి అదనపు బలం అవుతాడని విండీస్ ఆశించింది. కానీ తాజాగా రస్సెల్ తీరుతో ఆ జట్టు ఇప్పుడు అయోమయంలో పడింది. గాయం నుంచి కోలుకున్న అతడ్ని కనీస ప్రాక్టీస్ లేకుండా ఆడించాలా? వద్దా? అని జట్టు మేనేజ్‌మెంట్ సమాలోచన చేస్తోంది.