ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టీ20లకు వెస్టిండీస్ తమ జట్టును ప్రకటించింది. తమ టీమ్‌లో మూడు కీలక మార్పులు చేసినట్లు బుధవారం వెల్లడించింది. యువ పేసర్ షమార్ స్ప్రింగర్ పునరాగమనం చేయనుండగా.. మరో ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ సైతం రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపింది.
వన్డే సిరీస్ విండీస్‌దే
అదే విధంగా.. విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ ఇంగ్లండ్‌తో మిగిలిన టీ20లకు దూరమైనట్లు విండీస్ బోర్డు పేర్కొంది. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెస్టిండీస్ పర్యటనకు వచ్చింది. వన్డే సిరీస్‌ను ఆతిథ్య విండీస్ 2-1తో గెలుచుకోగా.. మొదటి రెండు టీ20లలో గెలిచి ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
17 బంతుల్లో 30 పరుగులు
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం మూడో టీ20 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో విండీస్ బోర్డు మిగిలిన సిరీస్‌కు తమ జట్టును ప్రకటించింది. కాగా బట్లర్ బృందంతో తొలి టీ20లో పాల్గొన్న రసెల్.. 17 బంతుల్లో నాలుగు సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. అయితే, వికెట్లు మాత్రం తీయలేకపోయాడు.
ఈ మ్యాచ్ సందర్భంగా మడమ నొప్పితో బాధపడ్డ ఆండ్రీ రసెల్.. రెండో టీ20కి దూరంగా ఉన్నాడు. అయితే, గాయం తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో అతడిని మిగిలిన మూడు టీ20 మ్యాచ్‌లకు ఎంపిక చేయలేదు. మరోవైపు.. గత నెలలో శ్రీలంకతో సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన షమార్ స్ప్రింగర్ రీఎంట్రీ ఇచ్చాడు.
డూ ఆర్ డై మ్యాచ్
అదే విధంగా.. మూడో వన్డే సందర్భంగా కెప్టెన్ షాయీ హోప్‌తో అనుచితంగా ప్రవర్తించినందుకు నిషేధం ఎదుర్కొన్న అల్జారీ జోసెఫ్ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. కాగా రసెల్ దూరం కావడం విండీస్‌కు పెద్ద ఎదురుదెబ్బలాంటిది. ఇక సెయింట్ లూసియా వేదికగా మూడో టీ20లో గెలిస్తేనే వెస్టిండీస్ సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.
చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో విండీస్ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా తొలి టీ20లో ఎనిమిది వికెట్లు, రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఇంగ్లండ్ విండీస్‌పై పూర్తి ఆధిపత్యం కనబరిచింది.
ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టీ20లకు వెస్టిండీస్ జట్టు
రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్‌మెయిర్, టెర్రాన్ హిండ్స్, షాయీ హోప్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, షమార్ స్ప్రింగర్.
చదవండి: సౌతాఫ్రికాతో మూడో టీ20.. కీలక మార్పు సూచించిన భారత మాజీ స్టార్
Comments
Please login to add a commentAdd a comment