విండీస్‌ ఓపెనర్ల ఊచకోత.. భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి | WI vs Eng 4th T20: Lewis Hope 50s West Indies Chase 219 Beat England | Sakshi
Sakshi News home page

విండీస్‌ ఓపెనర్ల ఊచకోత.. భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి

Published Sun, Nov 17 2024 11:42 AM | Last Updated on Sun, Nov 17 2024 11:54 AM

WI vs Eng 4th T20: Lewis Hope 50s West Indies Chase 219 Beat England

ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వెస్టిండీస్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇంగ్లిష్‌ జట్టు విధించిన భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి క్లీన్‌స్వీప్‌ గండం నుంచి బయటపడింది. కాగా స్వదేశంలో విండీస్‌.. బట్లర్‌ బృందంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతోంది.

ఇప్పటికే సిరీస్‌ ఇంగ్లండ్‌ కైవసం
ఇందులో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లలో గెలిచిన ఇంగ్లండ్‌ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సెయింట్‌ లూయీస్‌ వేదికగా ఆదివారం తెల్లవారుజామున నాలుగో టీ20 జరిగింది. డారెన్‌ సామీ జాతీయ క్రికెట్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

బెతెల్‌ మెరుపు ఇన్నింగ్స్‌
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌, విల్‌ జాక్స్‌ అదిరిపోయే ఆరంభం అందించారు. సాల్ట్‌ 35 బంతుల్లోనే 55 (5 ఫోర్లు, 4 సిక్స్‌లు), జాక్స్‌ 12 బంతుల్లోనే 25 (ఒక ఫోర్‌ 2 సిక్సర్లు) పరుగులు చేశారు. మిగతా వాళ్లలో కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (23 బంతుల్లో 38) రాణించగా.. జాకోబ్‌ బెతెల్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.

ఇంగ్లండ్‌ భారీ స్కోరు
మొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న బెతెల్‌ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో సామ్‌ కర్రాన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌(13 బంతుల్లో 24)తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో గుడకేశ్‌ మోటీ రెండు, అల్జారీ జోసెఫ్‌, రోస్టన్‌ ఛేజ్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

విండీస్‌ ఓపెనర్ల ఊచకోత.. 
విండీస్‌  ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ ఆది నుంచే దుమ్ములేపింది. ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌, షాయీ హోప్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో పరుగుల విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ లూయీస్‌ సిక్సర్ల వర్షం కురిపించగా.. హోప్‌ బౌండరీలతో పరుగులు రాబట్టాడు.

 

 

మెరుపు అర్ధ శతకాలు
లూయీస్‌ మొత్తంగా 31 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేయగా... హోప్‌ 24 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 రన్స్‌ స్కోరు చేశాడు. వీరిద్దరి మెరుపు అర్ధ శతకాలకు తోడు కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌(23 బంతుల్లో 38), షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌(17 బంతుల్లో 29 నాటౌట్‌)కూడా విలువైన ఇన్నింగ్స్‌ ఆడారు.

 

19 ఓవర్లలోనే
ఫలితంగా 19 ఓవర్లలోనే వెస్టిండీస్‌ టార్గెట్‌ను పూర్తి చేసింది. ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో రెహాన్‌ అహ్మద్‌ మూడు, జాన్‌ టర్నర్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ధనాధన్‌ హాఫ్‌ సెంచరీతో అలరించిన షాయీ హోప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 

వన్డే సిరీస్‌ విండీస్‌దే
కాగా తొలుత ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన వెస్టిండీస్‌.. టీ20 సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. అయితే, వైట్‌వాష్‌ గండం నుంచి తప్పించుకుని పర్యాటక జట్టు ఆధిక్యాన్ని 3-1కు తగ్గించింది. ఇరుజట్ల మధ్య భారత కాలమానం ప్రకారం సోమవారం వేకువజామున(ఉదయం 1.20 నిమిషాలకు) ఐదో టీ20 జరుగనుంది.

చదవండి: నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్‌ వర్మతో సూర్య

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement