ముర్రేకు షాకిచ్చిన జపాన్ స్టార్
బ్రిటన్ స్టార్ ప్లేయర్, యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ ఆండీ ముర్రేకు జపాన్ సంచలనం కీ నిషికోరి షాకిచ్చాడు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్, ఒలింపిక్స్ స్వర్ణంతో జోరు మీదున్న రెండో సీడెడ్ ముర్రేకు క్వార్టర్స్ లోనే బ్రేకులు పడ్డాయి. క్వార్టర్ ఫైనల్స్ లో ఐదు సెట్ల హోరాహోరీ పోరులో 1-6, 6-4, 4-6, 6-1, 7-5 తేడాతో ముర్రేపై నెగ్గి నిషికోరి సెమిఫైనల్స్ చేరుకున్నాడు. తొలి మూడు సెట్లలో రెండు సెట్లు కోల్పోయిన దశ నుంచి నిషికోరి అద్భుతంగా పుంజుకుని మాజీ చాంపియన్ ముర్రేను యూఎస్ ఓపెన్ నుంచి ఇంటిదారి పట్టించాడు. నాలుగో సెట్లో నిషికోరి ప్రతిఘటనకు ముర్రే తట్టుకోలేకపోయాడు.
ఓ దశలో మూడుసెట్లోనే మ్యాచ్ పూర్తవుతుందని అందరూ భావించగా.. ఆసియా ఆటగాడు తన రాకెట్కు పదును పెట్టడంతో మ్యాచ్ ఐదు సెట్ల వరకు వెళ్లింది. నిర్ణయాత్మక సెట్లో మాత్రం ముర్రే, నిషికోరి నువ్వానేనా అనే రీతిలో పోటీపడీ మరి పాయింట్లు సాధించారు. కొన్ని అనవసర తప్పిదాలు చేయడంతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. చివరి సెట్ నెగ్గి రెండోసారి యూఎస్ ఓపెన్ సెమిస్లోకి దూసుకెళ్లాడు. 2014లో యూఎస్ ఓపెన్ లో రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఓడినా.. ఓవరాల్ గా ముఖాముఖీ పోరులో గెలుపోటముల రికార్డులో నిషికోరిపై 9-2తో ముర్రేదే పైచేయి.