నిషికొరి కొట్టేశాడు
ముర్రేపై సంచలన విజయం
సెమీస్‌కు చేరిన జపాన్ స్టార్
వావ్రింకా, సెరెనా కూడా యూఎస్ ఓపెన్
న్యూయార్క్: రెండేళ్ల క్రితం యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన కీ నిషికొరి (జపాన్) మళ్లీ ఇన్నాళ్లకు గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. యూఎస్ ఓపెన్‌లో ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన నిషికొరి భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై 1-6, 6-4, 4-6, 6-1, 7-5తో సంచలన విజయం సాధించాడు. కీలక సమయాల్లో దూకుడైన ఆటతీరు ప్రదర్శించిన జపాన్ ప్లేయర్ దానికి తగిన ఫలితాన్ని అందుకోగా... ఒక దశలో ముర్రే వరుసగా ఏడు గేమ్‌లు కోల్పోయాడు. మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు కలిసి 17 బ్రేక్ పాయింట్లు నమోదు చేయడం విశేషం. 2014 ఫైనల్లో సిలిక్ చేతిలో ఓడిన నిషికొరి సెమీస్‌లో వావ్రింకా (స్విట్జర్లాండ్)తో తలపడతాడు.
హోరాహోరీ...
తొలి సెట్‌లో చక్కటి నియంత్రణతో ఆడిన ముర్రే ,పదునైన రిటర్న్‌ల సహాయంతో 35 నిమిషాల్లో సెట్‌ను గెలుచుకున్నాడు. అనంతరం రెండో సెట్‌లో వ్యూహం మార్చిన నిషికొరి డ్రాప్ షాట్లతో ఆధిక్యం ప్రదర్శించాడు. ఆసక్తికరంగా సాగిన మూడో సెట్‌లో స్కోరు 4-4 వద్ద సమంగా ఉన్నప్పుడు తొమ్మిదో గేమ్‌ను బ్రేక్ చేసిన ముర్రే ఆ తర్వాత సెట్‌నూ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే నాలుగో సెట్ ఆరంభంలో ఆర్థర్ యాష్ స్టేడియంలో సౌండ్ సిస్టం వ్యవస్థ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టింది. ఈ గోలపై రిఫరీకి ఫిర్యాదు కూడా చేసిన ముర్రే, ఈ దశలో పూర్తిగా ఏకాగ్రత కోల్పోయాడు.
మరో వైపు సంయమనం పాటించిన ఆరో సీడ్ దూసుకుపోయాడు. వరుసగా ఐదో గేమ్‌లు సొంతం చేసుకొని మ్యాచ్‌ను చివరి సెట్‌కు తీసుకుపోయాడు. ఐదో సెట్‌లోనూ 2-0తో అతను ముందంజ వేశాడు. అయితే కోలుకున్న ముర్రే 2-2తో స్కోరును సమం చేశాడు. నిషికొరి తర్వాతి రెండు గేమ్‌లు గెలిచినా... ముర్రే వరుసగా మూడు గేమ్‌లను సొంతం చేసుకొని 5-4తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే స్కోరు మళ్లీ 5-5తో సమమైంది. ఈ దశలో అద్భుతంగా ఆడి ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన నిషికొరి తర్వాతి గేమ్‌ను నిలబెట్టుకొని మ్యాచ్‌లో విజేతగా నిలిచాడు. స్టేడియంలో గోల వల్ల తాను ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అయినా... తన ఓటమికి అది మాత్రం కారణం కాదని మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు.
ఎనిమిదేళ్ల తర్వాత...
మరో క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7-6 (7/5), 4-6, 6-3, 6-2 స్కోరుతో ప్రపంచ 142వ ర్యాంకర్ యువాన్ డెల్‌పొట్రొ (అర్జెంటీనా)ను ఓడించాడు. 3 గంటల 12 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో స్విస్ ఆటగాడు 10 ఏస్‌లు సంధించాడు. 2009 యూఎస్ ఓపెన్ చాంపియన్ డెల్‌పొట్రొను వావ్రింకా ఓడించడం 2008 తర్వాత ఇదే తొలి సారి కావడం విశేషం. వింబుల్డన్ రెండో రౌండ్‌లో డెల్‌పొట్రొ చేతిలో వావ్రింకా చిత్తయ్యాడు.
పోరాడి గెలిచిన సెరెనా...
మహిళల విభాగంలో వరల్డ్ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ సెమీస్‌కు చేరడంలో మూడు సెట్ల పాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 2 గంటల 14 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 6-2, 4-6, 6-3తో ఐదో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)ను ఓడించింది. టోర్నీలో తొలి సారి సెట్‌ను కోల్పోయిన సెరెనా ఏకంగా 43 అనవసర తప్పిదాలు చేసింది. అయితే 18 ఏస్‌లు కొట్టి ఆమె మ్యాచ్‌ను కాపాడుకుంది. సెమీస్‌లో సెరెనా పదో సీడ్ ప్లిస్కోవా (చెక్)తో తలపడుతుంది.
ఆండీ ముర్రేతో గతంలో తలపడిన ఎనిమిది మ్యాచ్‌లలో కీ నిషికొరి ఏడు సార్లు ఓడిపోయాడు. కొద్ది రోజుల క్రితమే రియో ఒలింపిక్స్ సెమీ ఫైనల్లో కూడా అతనికి పరాజయం ఎదురైంది. అయితే ఈ సారి ఈ జపాన్ స్టార్ తన ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. హోరాహోరీగా ఐదు సెట్ల పాటు సాగిన పోరులో వరల్డ్ నంబర్ 2ను ఓడించి కెరీర్‌లో రెండో సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీస్‌లోకి అడుగు పెట్టాడు.
మ్యాచ్ ఐదో సెట్‌కు వెళితే చాలు... నిషికొరి చెలరేగిపోతాడని అతని ఏటీపీ రికార్డు చెబుతోంది. ఇలాంటి మ్యాచ్‌లలో 79 శాతం నెగ్గిన ఘనత ఓపెన్ ఎరాలో ఎవరికీ లేదు. ఇప్పుడు కూడా అతను అదే చేసి చూపించగా... ఈ క్యాలెండర్ ఇయర్‌లో నాలుగో స్లామ్‌లోనూ ఫైనల్‌కు చేరాలని భావించిన ముర్రే కోరిక తీరలేదు. 3 గంటల 57 నిమిషాల పాటు సాగిన సెమీస్‌లో చివరకు నిషికొరిదే పైచేయి అయింది.