న్యూయార్క్: ఈ ఏడాది వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ ఫైనల్ చేరడానికి సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో విజయం దూరంలో నిలిచాడు. టెన్నిస్ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 13వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 2 గంటల 35 నిమిషాల్లో 6–1, 6–4, 6–4తో తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు.
ఫ్రిట్జ్‌తో గతంలో ఆడిన ఏడుసార్లూ గెలుపొందిన జొకోవిచ్ ఎనిమిదోసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. ఏడు ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ సెర్బియా స్టార్ నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి 13 సార్లు పాయింట్లు గెలిచాడు. 2016 వింబుల్డన్ టోర్నీ మూడో రౌండ్‌లో సామ్ క్వెరీ (అమెరికా) చేతిలో ఓడిన జొకోవిచ్ ఆ తర్వాత అమెరికా ఆటగాళ్లతో 30 సార్లు తలపడినా ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు.
ఫ్రిట్జ్‌పై విజయంతో జొకోవిచ్ రికార్డు పుస్తకాల్లోకి కూడా ఎక్కాడు. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సెమీఫైనల్ చేరిన ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా కెరీర్‌లో 47వ సారి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ బెర్త్ దక్కించుకున్న జొకోవిచ్ స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ (46 సార్లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
2011 తర్వాత సెమీస్‌లోకి బోపన్న
పురుషుల డబుల్స్ విభాగంలో ఆరో సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 43 ఏళ్ల బోపన్న 2011 తర్వా త యూఎస్ ఓపెన్ డబుల్స్‌లో సెమీఫైనల్ చేరుకోవడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జంట 7–6 (12/10), 6–1తో లామోన్స్–జాక్సన్ విత్రో (అమెరికా) ద్వయంపై గెలిచింది.
వరుసగా మూడో ఏడాది...
మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ అరీనా సబలెంకా (బెలారస్) ఈ టోర్నీలో వరుసగా మూడో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో సబలెంకా 6–1, 6–4తో కిన్వెన్ జెంగ్ (చైనా)పై గెలిచింది. తొమ్మిదో సీడ్, ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్), 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీఫైనల్లో సబలెంకా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో పదో సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) 6–0, 6–3తో సొరానా క్రిస్టియా (రొమేనియా)పై గెలిచి తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరింది.
ఐదో అన్‌సీడెడ్ ప్లేయర్‌గా...
మరో క్వార్టర్ ఫైనల్లో 20 ఏళ్ల అన్‌సీడెడ్ అమెరికా ప్లేయర్ బెన్ షెల్టన్ 3 గంటల 7 నిమిషాల్లో 6–2, 3–6, 7–6 (9/7), 6–2తో అమెరికాకే చెందిన పదో సీడ్ ఫ్రాన్సెస్ టియాఫోను ఓడించి కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గత 23 ఏళ్లలో ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన ఐదో అన్‌సీడెడ్ ప్లేయర్‌గా షెల్టన్ గుర్తింపు పొందాడు.
ఈ జాబితాలో టాడ్ మార్టిన్ (అమెరికా; 2000లో), రాబీ జినెప్రి (అమెరికా; 2005లో), మిఖాయిల్ యూజ్నీ (రష్యా; 2006లో), దిమిత్రోవ్ (బల్గేరియా; 2019లో) ఉన్నారు. సెమీఫైనల్లో జొకోవిచ్‌పై షెల్టన్ గెలిస్తే 1996లో మార్క్ ఫిలిప్పోసిస్ (ఆ్రస్టేలియా) తర్వాత యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన తొలి అన్‌సీడెడ్ ప్లేయర్‌గా ఘనత సాధిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment