Kei Nishikori
-
వింబుల్డన్: బార్టీ అలవోకగా..
లండన్: ఫ్రెంచ్ ఓపెన్ విజేత, మహిళల సింగిల్స్‌లో తాజా నెం.1 ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో శుభారంభం చేసింది. మంగళవారం తొలి రౌండ్ మ్యాచ్‌లో బార్టీ 6–4, 6–2తో జంగ్ (చైనా)పై అలవోకగా గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్‌లోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్(అమెరికా) 6–2, 6–4తో బిసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) పై, మాజీ నెం.1, ఐదో సీడ్ ఏంజెలిక్ కెర్బర్ (జర్మనీ) 6–4, 6–3తో మరియ (జర్మనీ)పై, వరల్డ్ నెం.13 బెనిసిచ్ (స్విట్జర్లాండ్) 6–2, 6–3తో పవ్లిచెంకోవా(రష్యా)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ నిషికోరి(జపాన్) 6–4, 7–6(7/3), 6–4తో మౌంటెరియో(బ్రెజిల్)పై, నిక్ కిర్గియోస్ (ఆస్ట్రేలియా) 7–6(7/4), 3–6, 7–6(12/10), 0–6, 6–1తో తమ దేశానికే చెందిన జె.థాంప్సన్పై చెమటోడ్చి నెగ్గగా, ఐదో సీడ్ డొమెనిక్ థీమ్ (ఆస్ట్రియా) 7–6(7/4), 6–7(1/7), 3–6, 0–6తో అన్ సీడెడ్ క్వెర్రీ(అమెరికా) చేతిలో కంగుతిన్నాడు. -
జకోవిచ్ అలవోకగా..
పారిస్: ప్రపంచ నెం.1, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో అలవోకగా క్వార్టర్ఫైనల్స్కు దూసుకెళ్లాడు. సోమవారం పురుషుల సింగిల్స్‌లో జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో జకోవిచ్ 6–3, 6–2, 6–2తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్(జర్మనీ)ని చిత్తు చేశాడు. గంటా 36 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్ 6 ఏస్‌లు సంధించి, 3 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 31 విన్నర్లు కొట్టి, 12 అనవసర తప్పిదాలు చేశాడు. సుదీర్ఘంగా జరిగిన మరో మ్యాచ్‌లో నిషికొరి(జపాన్) 6–2, 6–7(8/10), 6–2, 6–7(8/10), 7–5తో బెనాయిట్ పైర్(ఫ్రాన్స్)పై చెమటోడ్చి నెగ్గాడు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ మారథాన్ పోరులో ఏడో సీడ్ నిషికోరికి 38వ ర్యాంకర్ అయిన ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలి, మూడవ సెట్లను నిషికోరి దక్కించుకోగా, టైబ్రేక్‌కు దారితీసిన రెండు, నాలుగు సెట్లు పైర్ వశమయ్యాయి. నిర్ణయాత్మక ఐదో సెట్లోనూ పోరు హోరాహోరీ సాగింది. పాయింట్ పాయింట్‌కూ ఇద్దరూ చెమటోడ్చారు. చివరి ఈ సెట్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకున్న నిషికోరి తదుపరి రౌండ్లో రెండో సీడ్ నాదల్‌తో తలపడతాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్ మాడిసన్ కీస్(అమెరికా) 6–2, 6–4తో సినియకోవా(చెక్‌రిపబ్లిక్)ను వరుస సెట్లలో చిత్తు చేసి క్వార్టర్ఫైనల్స్కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో సోఫియా కెనిన్(అమెరికా)ను 3–6, 6–3, 0–6తో ఇంటిబాట పట్టించిన ఎనిమిదో సీడ్ ఆష్లే బార్టీ(ఆస్ట్రేలియా)తో తదుపరి రౌండ్లో మాడిసన్ కీస్‌తో తలపడనుంది. -
నిషికొరి కొట్టేశాడు
ముర్రేపై సంచలన విజయం సెమీస్‌కు చేరిన జపాన్ స్టార్ వావ్రింకా, సెరెనా కూడా యూఎస్ ఓపెన్ న్యూయార్క్: రెండేళ్ల క్రితం యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన కీ నిషికొరి (జపాన్) మళ్లీ ఇన్నాళ్లకు గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. యూఎస్ ఓపెన్‌లో ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన నిషికొరి భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై 1-6, 6-4, 4-6, 6-1, 7-5తో సంచలన విజయం సాధించాడు. కీలక సమయాల్లో దూకుడైన ఆటతీరు ప్రదర్శించిన జపాన్ ప్లేయర్ దానికి తగిన ఫలితాన్ని అందుకోగా... ఒక దశలో ముర్రే వరుసగా ఏడు గేమ్‌లు కోల్పోయాడు. మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు కలిసి 17 బ్రేక్ పాయింట్లు నమోదు చేయడం విశేషం. 2014 ఫైనల్లో సిలిక్ చేతిలో ఓడిన నిషికొరి సెమీస్‌లో వావ్రింకా (స్విట్జర్లాండ్)తో తలపడతాడు. హోరాహోరీ... తొలి సెట్లో చక్కటి నియంత్రణతో ఆడిన ముర్రే ,పదునైన రిటర్న్‌ల సహాయంతో 35 నిమిషాల్లో సెట్‌ను గెలుచుకున్నాడు. అనంతరం రెండో సెట్లో వ్యూహం మార్చిన నిషికొరి డ్రాప్ షాట్లతో ఆధిక్యం ప్రదర్శించాడు. ఆసక్తికరంగా సాగిన మూడో సెట్లో స్కోరు 4-4 వద్ద సమంగా ఉన్నప్పుడు తొమ్మిదో గేమ్‌ను బ్రేక్ చేసిన ముర్రే ఆ తర్వాత సెట్‌నూ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే నాలుగో సెట్ ఆరంభంలో ఆర్థర్ యాష్ స్టేడియంలో సౌండ్ సిస్టం వ్యవస్థ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టింది. ఈ గోలపై రిఫరీకి ఫిర్యాదు కూడా చేసిన ముర్రే, ఈ దశలో పూర్తిగా ఏకాగ్రత కోల్పోయాడు. మరో వైపు సంయమనం పాటించిన ఆరో సీడ్ దూసుకుపోయాడు. వరుసగా ఐదో గేమ్‌లు సొంతం చేసుకొని మ్యాచ్‌ను చివరి సెట్‌కు తీసుకుపోయాడు. ఐదో సెట్లోనూ 2-0తో అతను ముందంజ వేశాడు. అయితే కోలుకున్న ముర్రే 2-2తో స్కోరును సమం చేశాడు. నిషికొరి తర్వాతి రెండు గేమ్‌లు గెలిచినా... ముర్రే వరుసగా మూడు గేమ్‌లను సొంతం చేసుకొని 5-4తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే స్కోరు మళ్లీ 5-5తో సమమైంది. ఈ దశలో అద్భుతంగా ఆడి ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన నిషికొరి తర్వాతి గేమ్‌ను నిలబెట్టుకొని మ్యాచ్‌లో విజేతగా నిలిచాడు. స్టేడియంలో గోల వల్ల తాను ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అయినా... తన ఓటమికి అది మాత్రం కారణం కాదని మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. ఎనిమిదేళ్ల తర్వాత... మరో క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7-6 (7/5), 4-6, 6-3, 6-2 స్కోరుతో ప్రపంచ 142వ ర్యాంకర్ యువాన్ డెల్‌పొట్రొ (అర్జెంటీనా)ను ఓడించాడు. 3 గంటల 12 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో స్విస్ ఆటగాడు 10 ఏస్‌లు సంధించాడు. 2009 యూఎస్ ఓపెన్ చాంపియన్ డెల్పొట్రొను వావ్రింకా ఓడించడం 2008 తర్వాత ఇదే తొలి సారి కావడం విశేషం. వింబుల్డన్ రెండో రౌండ్లో డెల్‌పొట్రొ చేతిలో వావ్రింకా చిత్తయ్యాడు. పోరాడి గెలిచిన సెరెనా... మహిళల విభాగంలో వరల్డ్ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ సెమీస్‌కు చేరడంలో మూడు సెట్ల పాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 2 గంటల 14 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 6-2, 4-6, 6-3తో ఐదో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)ను ఓడించింది. టోర్నీలో తొలి సారి సెట్‌ను కోల్పోయిన సెరెనా ఏకంగా 43 అనవసర తప్పిదాలు చేసింది. అయితే 18 ఏస్‌లు కొట్టి ఆమె మ్యాచ్‌ను కాపాడుకుంది. సెమీస్‌లో సెరెనా పదో సీడ్ ప్లిస్కోవా (చెక్)తో తలపడుతుంది. ఆండీ ముర్రేతో గతంలో తలపడిన ఎనిమిది మ్యాచ్‌లలో కీ నిషికొరి ఏడు సార్లు ఓడిపోయాడు. కొద్ది రోజుల క్రితమే రియో ఒలింపిక్స్ సెమీ ఫైనల్లో కూడా అతనికి పరాజయం ఎదురైంది. అయితే ఈ సారి ఈ జపాన్ స్టార్ తన ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. హోరాహోరీగా ఐదు సెట్ల పాటు సాగిన పోరులో వరల్డ్ నంబర్ 2ను ఓడించి కెరీర్లో రెండో సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీస్‌లోకి అడుగు పెట్టాడు. మ్యాచ్ ఐదో సెట్‌కు వెళితే చాలు... నిషికొరి చెలరేగిపోతాడని అతని ఏటీపీ రికార్డు చెబుతోంది. ఇలాంటి మ్యాచ్‌లలో 79 శాతం నెగ్గిన ఘనత ఓపెన్ ఎరాలో ఎవరికీ లేదు. ఇప్పుడు కూడా అతను అదే చేసి చూపించగా... ఈ క్యాలెండర్ ఇయర్లో నాలుగో స్లామ్లోనూ ఫైనల్‌కు చేరాలని భావించిన ముర్రే కోరిక తీరలేదు. 3 గంటల 57 నిమిషాల పాటు సాగిన సెమీస్‌లో చివరకు నిషికొరిదే పైచేయి అయింది. -
ముర్రేకు షాకిచ్చిన జపాన్ స్టార్
బ్రిటన్ స్టార్ ప్లేయర్, యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ ఆండీ ముర్రేకు జపాన్ సంచలనం కీ నిషికోరి షాకిచ్చాడు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్, ఒలింపిక్స్ స్వర్ణంతో జోరు మీదున్న రెండో సీడెడ్ ముర్రేకు క్వార్టర్స్ లోనే బ్రేకులు పడ్డాయి. క్వార్టర్ ఫైనల్స్ లో ఐదు సెట్ల హోరాహోరీ పోరులో 1-6, 6-4, 4-6, 6-1, 7-5 తేడాతో ముర్రేపై నెగ్గి నిషికోరి సెమిఫైనల్స్ చేరుకున్నాడు. తొలి మూడు సెట్లలో రెండు సెట్లు కోల్పోయిన దశ నుంచి నిషికోరి అద్భుతంగా పుంజుకుని మాజీ చాంపియన్ ముర్రేను యూఎస్ ఓపెన్ నుంచి ఇంటిదారి పట్టించాడు. నాలుగో సెట్లో నిషికోరి ప్రతిఘటనకు ముర్రే తట్టుకోలేకపోయాడు. ఓ దశలో మూడుసెట్లోనే మ్యాచ్ పూర్తవుతుందని అందరూ భావించగా.. ఆసియా ఆటగాడు తన రాకెట్‌కు పదును పెట్టడంతో మ్యాచ్ ఐదు సెట్ల వరకు వెళ్లింది. నిర్ణయాత్మక సెట్లో మాత్రం ముర్రే, నిషికోరి నువ్వానేనా అనే రీతిలో పోటీపడీ మరి పాయింట్లు సాధించారు. కొన్ని అనవసర తప్పిదాలు చేయడంతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. చివరి సెట్ నెగ్గి రెండోసారి యూఎస్ ఓపెన్ సెమిస్లోకి దూసుకెళ్లాడు. 2014లో యూఎస్ ఓపెన్ లో రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓడినా.. ఓవరాల్ గా ముఖాముఖీ పోరులో గెలుపోటముల రికార్డులో నిషికోరిపై 9-2తో ముర్రేదే పైచేయి. -
టొరంటో మాస్టర్స్ ఫైనల్లోకి జొకోవిచ్
టొరంటో: ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ టొరంటో మాస్టర్స్ టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్ లో 6-3, 6-2 తేడాతో గేల్ మోనఫిల్స్ ను మట్టికరిపించాడు. మాస్టర్స్ ఈవెంట్లో గత 15 మ్యాచులలో 14వ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 74 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో రెండు సెట్లలోనూ జొకోకు ప్రత్యర్థి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. టోర్నీలో గత అన్ని మ్యాచులలో చెమటోడ్చి నెగ్గిన జొకో సెమిస్ లో మాత్రం సునాయసంగా గెలుపొందాడు. ఫైనల్లో జపాన్ సంచలనం నిషికోరితో తలపడనున్నాడు. గతేడాది మియామీ టోర్నీలో నిషికోరిపై జొకోవిచ్ గెలుపొందిన విషయం తెలిసిందే. మరో సెమిఫైనల్లో స్విట్జర్లాండ్ కు చెందిన స్టాన్ వావ్రింకాను 7-6(8/6), 6-1తో వరుస సెట్లలో ఓడించాడు. తొలి సెట్లో చెమటోడ్చిన నిషికోరికి రెండో సెట్లో వావ్రింకా నుంచి ఎలాంటి పోటీ లేకపోవడంతో సులువుగా సెట్ కైవసం చేసుకుని ఫైనల్లోకి ప్రవేశించాడు. -
ఆస్ట్రేలియా ఓపెన్ లో డేవిడ్ ఫెర్రర్ ఓటమి
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో ప్రపంచ తొమ్మిదో నంబర్ క్రీడాకారుడు డేవిడ్ ఫెర్రర్ ఓటమి చెందాడు. సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఫెర్రర్ 6-3, 6-3, 6-3 తేడాతో కియో నిషీ కోరీ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఏ దశలోనూ నిషీ కోరీకి పోటీనివ్వని ఫెర్రర్ వరుస సెట్లను కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అంతకుముందు జరిగిన నాల్గో రౌండ్ లో సెరెనా విలియమ్స్ క్వార్టర్స్ కు చేరగా,విక్టోరియా అజెరెంకా మాత్రం ఓటమి పాలై టోర్నీ నుంచి భారంగా వెనుదిరిగింది. -
నాడు దోషి... నేడు విజేత
శతాబ్దంన్నర కంటే ఎక్కువ చరిత్ర కలిగిన గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఆసియా క్రీడాకారుడికి ప్రతిష్టాత్మక సింగిల్స్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అయితే జపాన్ యువకెరటం కీ నిషికోరి రూపంలో తొలిసారి ఆసియా క్రీడాకారుడు ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. దాంతో యూఎస్ ఓపెన్‌లో ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతుందని యావత్ జపాన్‌తోపాటు ఆసియా మొత్తం వేయి కళ్లతో ఎదురుచూసింది. అయితే క్రొయేషియా ఆజానుబాహుడు మారిన్ సిలిచ్ అసమాన ఆటతీరు ముందు నిషికోరి చేతులెత్తేయడంతో ఆసియా అభిమానులకు నిరాశ తప్పలేదు. తుది మెట్టుపై నిషికోరి బోల్తా యూఎస్ ఓపెన్ చాంపియన్ సిలిచ్ కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ రూ. 18 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం న్యూయార్క్: ఆసియా నుంచి పురుషుల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌ను చూసేందుకు ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. సంచలన విజయాలతో యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న జపాన్ యువతార కీ నిషికోరి పోరాటం టైటిల్ పోరులో ముగిసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో 14వ సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6-3, 6-3, 6-3తో పదో సీడ్ నిషికోరిపై గెలిచి యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించాడు. తద్వారా తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు. అంతేకాకుండా సిలిచ్ కెరీర్లో ఇది 300వ విజయం కావడం విశేషం. గంటా 54 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో సిలిచ్ 17 ఏస్‌లు సంధించడంతోపాటు నిషికోరి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు సిలిచ్ సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఒకేసారి సఫలమైన నిషికోరి 30 అనవసర తప్పిదాలు కూడా చేసి మూల్యం చెల్లించుకున్నాడు. విజేతగా నిలిచిన సిలిచ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 18 కోట్లు); రన్నరప్ నిషికోరికి 14 లక్షల 50 వేల డాలర్లు (రూ. 8 కోట్ల 73 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2001లో గొరాన్ ఇవానిసెవిచ్ (వింబుల్డన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి క్రొయేషియా క్రీడాకారుడిగా సిలిచ్ నిలిచాడు. యాదృచ్ఛికంగా ప్రస్తుతం సిలిచ్‌కు ఇవానిసెవిచ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ సాధించిన ఫైనల్ విజయాలు సోమవారమే రావడం విశేషం. తాజా ప్రదర్శనతో సిలిచ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానానికి, నిషికోరి 8వ స్థానానికి ఎగబాకారు. స్థిరమైన ఆటతీరు క్వార్టర్స్‌లో ఆరో సీడ్ బెర్డిచ్ను, సెమీఫైనల్లో ఐదుసార్లు చాంపియన్, రెండో సీడ్ ఫెడరర్‌ను వరుస సెట్లలో ఓడించి ఫైనల్ చేరిన సిలిచ్ అదే దూకుడును టైటిల్ పోరులోనూ ప్రదర్శించాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 82 కేజీల బరువున్న సిలిచ్ బుల్లెట్ వేగంతో కూడిన భారీ సర్వీస్‌లు... కచ్చితమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లు... నెట్‌వద్ద చలాకీతనంతో నిషికోరి ఆట కట్టించాడు. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జొకోవిచ్పై, మూడో సీడ్ వావ్రింకాపై, ఐదో సీడ్ రావ్నిక్లపై అద్భుత విజయాలు సాధించి ఫైనల్ చేరిన నిషికోరి తుదిపోరులో సిలిచ్ జోరు ముందు ఎదురునిలువలేకపోయాడు. 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 68 కేజీల బరువున్న నిషికోరి మ్యాచ్ మొత్తంలో రెండో సెట్లో మాత్రమే ఒకసారి సిలిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేయగలిగాడు. తన ప్రధాన ఆయుధం శక్తివంతమైన సర్వీస్‌లను నమ్ముకున్న సిలిచ్ ఆరోగేమ్‌లో నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అదే జోరులో తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్లో సిలిచ్ ఒకసారి తన సర్వీస్ కోల్పోయినా వెంటనే నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌పై తన పట్టుబిగించాడు. మూడో సెట్లోనూ సిలిచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌లో క్రాస్‌కోర్టు బ్యాక్‌హ్యాండ్ షాట్‌తో సిలిచ్ మ్యాచ్‌ను ముగించాడు. * ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక 14వ సీడ్ క్రీడాకారుడు గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గడం ఇదే తొలిసారి. * పీట్ సంప్రాస్ (2002లో-ప్రపంచ 17వ ర్యాంకర్) తర్వాత టాప్-10 ర్యాంకింగ్స్‌లో లేని క్రీడాకారుడు యూఎస్ ఓపెన్‌ను (సిలిచ్-ప్రపంచ 16వ ర్యాంకర్) గెలవడం ఇదే ప్రథమం. గాస్టన్ గాడియో (ప్రపంచ 44వ ర్యాంకర్; 2004-ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత సిలిచ్ రూపంలో టాప్-10లో లేని క్రీడాకారుడు ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాడు. * గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అత్యంత పొడగరి క్రీడాకారుడిగా యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా-2009 యూఎస్ ఓపెన్) సరసన సిలిచ్ చేరాడు. ఈ ఇద్దరూ 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్నారు. * ఓపెన్ శకంలో యూఎస్ ఓపెన్‌ను కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌గా నెగ్గిన 13వ క్రీడాకారుడు సిలిచ్. గతంలో ఆండీ ముర్రే (2012), డెల్‌పొట్రో (2009), లీటన్ హెవిట్ (2001) ఈ ఘనత సాధించారు. * ఓపెన్ శకంలో చివరి మూడు మ్యాచ్‌ల్లో (క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్) ఒక్క సెట్ కోల్పోకుండా గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఐదో ఆటగాడు సిలిచ్. గతంలో ఫెడరర్ (2003-వింబుల్డన్), రిచర్డ్ క్రాయిసెక్ (1996-వింబుల్డన్), ప్యాట్ క్యాష్ (1987-వింబుల్డన్), గిలెర్మో విలాస్ (1977-ఫ్రెంచ్ ఓపెన్) ఈ ఘనత సాధించారు. నాడు దోషి... నేడు విజేత క్లిష్ట పరిస్థితులు గొప్ప వ్యక్తుల్లోని అత్యుత్తమ ప్రతిభను వెలికితీస్తాయి. మారిన్ సిలిచ్ విషయంలో ఇది నిజమైంది. గత ఏడాది వింబుల్డన్ టోర్నమెంట్లో సిలిచ్ రెండో రౌండ్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా... మోకాలి నొప్పితో వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అయితే ఏప్రిల్‌లో మ్యూనిచ్ టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షలో విఫలమైనట్లు అతనికి వింబుల్డన్ టోర్నీలో సమాచారం ఇవ్వడంతో అతనీ నిర్ణయం తీసుకున్నట్లు తర్వాత తెలిసింది. దాంతో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సిలిచ్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. ఫలితంగా సిలిచ్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. 2013 చివర్లో తన చిన్ననాటి అభిమాన క్రీడాకారుడు గొరాన్ ఇవానిసెవిచ్ను కోచ్‌గా నియమించుకున్నాడు. అదే సమయంలో తన నిషేధంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో అప్పీలు చేశాడు. తన సహాయక సిబ్బందిలో ఎవరో తెలియకుండా తనకు నిషేధిత ఉత్ప్రేరకం ఉన్న మాత్రలను ఇవ్వడంతోనే ఇలా జరిగిందని వాదించాడు. సిలిచ్ వాదనలతో ఏకభవించిన కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ నిషేధాన్ని నాలుగు నెలలకు కుదించింది. సత్తా ఉన్నా సరైన ప్రణాళిక లేకపోవడంతో సిలిచ్లో ఉన్న అసలు చాంపియన్ బయటకు రావడంలేదని ఇవానిసెవిచ్ గ్రహించాడు. అతని ఆటలోని లోపాలను సవరించాడు. అతని ప్రధాన ఆయుధమైన భారీ సర్వీస్‌లకు మరింతగా పదును పెట్టాడు. పదేపదే ప్రత్యర్థి గురించి ఆలోచించకుండా తనదైన శైలిలో దూకుడుగా ఆడాలని సూచించాడు. అయితే సిలిచ్ తన ఆటతీరును మార్చుకోవడానికి ఆరేడు నెలల సమయం పట్టింది. ఎట్టకేలకు యూఎస్ ఓపెన్‌లో అనుకున్న ఫలితం వచ్చింది. మూడో రౌండ్లో 18వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా), నాలుగో రౌండ్లో 26వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్), క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), సెమీఫైనల్లో ఫెడరర్ (స్విట్జర్లాండ్) లను ఓడించిన సిలిచ్ ఫైనల్లో పదో సీడ్ నిషికోరిపై గెలిచి చాంపియన్‌గా నిలిచాడు. డోపింగ్‌లో దోషిగా తేలి కెరీర్ ప్రమాదంలో పడిన సమయంలో సిలిచ్ స్థయిర్యం కోల్పోకుండా పరిణతితో వ్యవహరించాడు. పట్టుదలే పెట్టుబడిగా పోరాటం చేసి గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచి కెరీర్‌ను చక్కదిద్దుకున్నాడు. -
మారిన్ సిలిచ్ కు యూఎస్ ఓపెన్ టైటిల్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను క్రొయేషియాకు చెందిన 14వ సీడ్ ఆటగాడు మారిన్ సిలిచ్ గెలుచుకున్నాడు. అతడికిది తొలి గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో పదో సీడ్ కీ నిషికోరి (జపాన్)ను 6-3, 6-3, 6-3తో ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను కంగుతినిపించిన నిషికోరి తుదిపోరులో పెద్దగా పోరాడకుండానే తలవంచాడు. 2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్ (సఫిన్, హెవిట్) ఫైనల్ తర్వాత... ఫెడరర్, జొకోవిచ్, రాఫెల్ నాదల్‌లలో ఒక్కరూ లేకుండా గ్రాండ్‌స్లామ్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. డోపింగ్‌లో పట్టుబడిన కారణంగా గతేడాది యూఎస్ ఓపెన్‌కు దూరంగా ఉన్న మారిన్ సిలిచ్ ఈసారి ఏకంగా విజేతగా అవతరించాడు.