
లండన్: బ్రిటన్ టెన్నిస్ స్టార్, వింబుల్డన్ మాజీ చాంపియన్ ఆండీ ముర్రే తుంటి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ‘లండన్‌లో సోమవారం జరిగిన శస్త్రచికిత్సతో కొంత ఉపశమనం పొందా. సమస్య నుంచి ఇది గట్టెక్కిస్తుందని ఆశిస్తున్నాం’ అంటూ అతడు ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. 31 ఏళ్ల ముర్రే ఇటీవలి ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా తన గాయం తీవ్రతను వివరిస్తూ వింబుల్డన్ తర్వాత టెన్నిస్ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు.
అయితే, శస్త్రచికిత్సలో భాగంగా అతడి తుంటి భాగంలో ఇనుప ప్లేట్ అమర్చారు. దీంతో అతడు మళ్లీ ఉన్నత శ్రేణి టెన్నిస్ ఆడే అవకాశాలు క్లిష్టమేనని తెలుస్తోంది. వింబుల్డన్ సమయానికీ ఫిట్ కావడం సందేహంగానే ఉంది. గత ఏడాదిలో ముర్రే తుంటికి శస్త్రచికిత్స జరగడం ఇది రెండోసారి.