ఓటమికి భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ కారణం కాదు!
సిడ్నీ: యాషెస్ సిరీస్ ను కోల్పోయిన అనంతరం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ జట్టు ఓటమికి పలు కారణాలను ఎత్తిచూపుతూ అటు మాజీలు, విశ్లేషకులు మండిపడుతున్నారు. అసలు ఆసీస్ ఓటమికి భార్యలను, గర్లఫ్రెండ్స్ లను వెంట తీసుకెళ్లడంతో పాటు, జట్టులో సమిష్టితత్వం లోపించడమే ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు తమ భార్యలను విదేశీ టూర్లకు తీసుకువెళ్లి.. జట్టుతో కాకుండా వేరేగా ఉండటమేనని ఆస్టేలియన్ పత్రిక సిడ్నీ డైలీ టెలీగ్రాఫ్ పేర్కొంది. అయితే దీనిపై ఆ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ తీవ్రంగా మండిపడ్డాడు. ఆ వార్తలను ఖండించిన క్లార్క్.. అందులో వాస్తవం ఎంతమాత్రం లేదన్నాడు. తాను చేసిన 28 సెంచరీల్లో.. 10 టెస్టు సెంచరీలు భార్యను వెంట తీసుకువెళ్లి చేసినవేనంటూ తిరిగి కౌంటర్ ఇచ్చాడు.
అసలు తాను జట్టు తో ఉండకుండా ఆఫ్ ఫీల్డ్ రిలేషన్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొనడం తగదన్నాడు. ప్రతీ రోజు ఆట ముగిసిన తరువాత ఎలా ఆడాం?ఎలా ఆడాలి?అనే దానిపై జట్టు సభ్యులు అంతా కలిసి చర్చించుకుంటామని ఈ సందర్భంగా క్లార్క్ పేర్కొన్నాడు. యాషెస్ సిరీస్ నాల్గో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఓటమి పాలై.. సిరీస్ ను 3-1 తేడాతో కోల్పోయింది. దీంతో క్లార్క్ తన టెస్టు కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. తాను యాషెస్ లో ఐదో టెస్ట్ అనంతరం టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పనున్నట్లు ప్రకటించాడు.