శ్రీలంక గడ్డపై సిరీస్ గెలిచేందుకు భారత్ ముందు ఇప్పుడు మంచి అవకాశం సిద్ధంగా ఉంది. ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్‌తో పాటు కీపర్
అనిల్ కుంబ్లే
శ్రీలంక గడ్డపై సిరీస్ గెలిచేందుకు భారత్ ముందు ఇప్పుడు మంచి అవకాశం సిద్ధంగా ఉంది. ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్‌తో పాటు కీపర్ గాయంతో దూరమైనా, మూడో టెస్టుకు ముందు భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. సిరీస్ తుది ఫలితం ఎలా ఉన్నా ప్రతీ టెస్టులో మూడు వేర్వేరు జోడీలతో ఓపెనింగ్ చేయించడం భారత్‌కు సంబంధించి కొత్త అనుభవం. కరుణ్ నాయర్‌కు సరైన సమయంలో అవకాశం దక్కింది కానీ పుజారా, రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశాలే ఉన్నాయి. కరుణ్‌కు కూడా అవకాశం ఇచ్చి రాహుల్‌తో కీపింగ్ చేయించాలనే ప్రతిపాదన ఉన్నా, టీమ్ మేనేజ్‌మెంట్ దీనిపై ఆసక్తి చూపదని నా ఉద్దేశం.
ఇలా చేయడం నా దృష్టిలో రాహుల్, ఓజాలకు అన్యాయం చేసినట్లే. రాహుల్ కర్ణాటకకు అప్పుడప్పుడు, గత టెస్టులో అత్యవసర పరిస్థితిలో కీపింగ్ చేసినా... ఓజాలాంటి రెగ్యులర్ కీపర్‌ను తన పని చేయనీయకపోవడం సరైంది కాదు. మూడో టెస్టులో భారత్ ముందుగా ఫీల్డింగ్ చేయాల్సి వస్తే రాహుల్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి? సంగక్కర రిటైర్మెంట్ తర్వాత తమ యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు లంకకు ఇది చక్కటి అవకాశం. ఒకరిద్దరు కొత్త ఆటగాళ్లు తుది జట్టులోకి వస్తే... తమను తాము నిరూపించుకునేందుకు ఎస్‌ఎస్‌సీ లాంటి బ్యాటింగ్ పిచ్ వారికి సరైన వేదిక. గతంలోనూ ఇక్కడ భారీగా పరుగులు వెల్లువెత్తాయి.
అయినా మన బౌలర్లు 20 వికెట్లు తీయగలరన్న నమ్మకం నాకుంది. అశ్విన్, మిశ్రాలు చెలరేగుతున్నందున పేసర్లు కొంత సహకరిస్తే సిరీస్ మనకు దక్కుతుంది. మరో వైపు సీనియర్ల అండ లేకుండా బరిలోకి దిగుతున్న శ్రీలంక కెప్టెన్ మ్యాథ్యూస్‌పై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. దీనిని భారత్ ఉపయోగించుకోవాలి. అన్నింటికీ మించి వర్షం అడ్డు రాకూడదని కూడా కోరుకోవాలి.