హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు వన్డేల అనంతరం విరాట్ కోహ్లి సారథ్యంపై అన్నివైపులా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మైదానంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కోహ్లి ఎక్కువగా ధోనిపై ఆధారపడతాడని విమర్శిస్తున్నారు. కోహ్లి గొప్ప ఆటగాడే కావచ్చు కానీ.. గ్రేట్ కెప్టెన్ కాదంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఇక ఇప్పటికే దీనిపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు సెటైర్లు వేసుకుంటున్నారు. ధోని లేకుంటే కోహ్లి డమ్మీనే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక టీమిండియాకు అసలు సిసలు నాయకుడంటే ధోనినే అంటూ మరికొంత మంది నెటిజన్లు పేర్కొంటున్నారు.
అయితే ఈ విషయంపై తాజాగా టీమిండియా మాజీ సారథి, కోచ్ అనిల్ కుంబ్లే స్పందించారు. ఎంఎస్ ధోని మైదానంలో ఉంటే కోహ్లికి అన్ని విధాల సౌకర్యంగా ఉంటుందన్నారు. వికెట్ల వెనకాల ఉంటూ అతడు రచించే వ్యూహాలు బౌలర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దీంతో బౌలర్ల పని చాలా సులువవుతుందన్నారు. అందుకే వన్డేల్లో చివరి 10-15 ఓవర్లలో సారథ్య బాధ్యతలు ధోనికి అప్పగించి.. కోహ్లి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తాడని గుర్తుచేశారు. ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు టీమిండియా సారథ్య బాధ్యతలు మెల్లిమెల్లిగా కోహ్లి నుంచి ధోనికి వెలుతుందని చమత్కరించారు.
ఇక ధోని ప్రపంచకప్‌లో తప్పక ఆడాల్సిందేనని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు. మైదానంలో అతని బుర్ర పాదరసంలా పనిచేస్తుందన్నారు. అవి జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సారథ్యం విషయంలో అతడి అతడే పోటీ అని అభివర్ణించారు. సుదీర్ఘకాలం టీమిండియాకు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇక 2007లో సారథ్య బాధ్యతలు చేపట్టిన ధోని.. అతడి కెప్టెన్సీలోనే మూడు ఐసీసీ టోర్నీలను టీమిండియా గెలుచుకుంది. ఇక 2014లో టెస్టు, 2017లో పరిమిత ఓవర్ల క్రికెట్ సారథ్య బాధ్యతలను కోహ్లికి అప్పగించాడు.
Comments
Please login to add a commentAdd a comment