పది వికెట్లు.. పది మేడిన్లు!
నర్మదాపురం: భారత మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఒక ఇన్నింగ్స్లో పది వికెట్లు తీసిన ఘనత ప్రతీ క్రికెట్ అభిమాని మదిలో చెరిగిపోని జ్ఞాపకమే. 1999లో ఢిల్లీలో పాకిస్తాన్తో జరిగిన టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో కుంబ్లే 10 వికెట్లను తీసి అరుదైన ఘనతను సాధించాడు. అయితే ఆ అద్భుతమైన గణాంకాలను మరోసారి గుర్తు చేశాడు మధ్యప్రదేశ్ కు చెందిన పాలాష్ కోచర్. గత కొంతకాలంగా ఆకట్టుకుంటున్న ఈ యువ బౌలర్ తాజాగా జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో 10 వికెట్లను తీసి శభాష్ అనిపించాడు.
అండర్ -23లో భాగంగా ఇంటర్ డివిజనల్ ఎమ్ వే మెమోరియల్ జట్టుకు ఆడుతున్న పాలాష్ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. నర్మదాపురంతో జరిగిన మ్యాచ్లో పాలాష్ తన లెగ్ స్పిన్ మంత్రంతో చెలరేగిపోయాడు. పాలాష్ బౌలింగ్ ధాటికి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు విలవిల్లాడిపోయారు. పాలాష్ 28.1 ఓవర్లపాటు బౌలింగ్ వేసి పది వికెట్లను సాధించడంతో పాటు 10.0 మేడిన్ ఓవర్లు వేసి సత్తా చాటుకున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఒక ఇన్నింగ్స్ లో 10 వికెట్లను తీసిన తొలి బౌలర్గా పాలాష్ చరిత్ర సృష్టించాడు.
ఈ ఘనతను అంతర్జాతీయ స్థాయిలో ఇద్దరు బౌలర్లు మాత్రమే సొంతం చేసుకున్నారు. యాషెస్ సిరీస్లో భాగంగా 1956 లో ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గో టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ కు చెందిన జిమ్ లేకర్ 10 వికెట్లను సాధించి ఆ మైలురాయిని నమోదు చేసిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. ఆ తరువాత 43 ఏళ్లకి అనిల్ కుంబ్లే ఆ ఘనతను సాధించాడు.