బాలచంద్రకు మరో విజయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ యువ ఆటగాడు ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో తన జోరు కొనసాగిస్తున్నాడు. ఇక్కడి కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం ఆరో రౌండ్‌లో ప్రసాద్ విజయం దక్కించుకున్నాడు. తనకంటే ఎంతో మెరుగైన ప్రత్యర్థి, ఇంటర్నేషనల్ మాస్టర్ రవిచంద్రన్ సిద్ధార్థ్‌పై అతను సంచలన విజయం సాధించాడు. రాష్ట్రానికి చెందిన అగ్రశ్రేణి ఆటగాడు, గ్రాండ్‌మాస్టర్ ఎంఆర్ లలిత్‌బాబు, మరో జీఎం దీపన్ చక్రవర్తితో జరిగిన తన ఆరో రౌండ్ గేమ్‌ను డ్రాగా ముగించాడు.
ఫలితంగా ఆరు రౌండ్లు ముగిసే సరికి 4 పాయింట్లతో పట్టికలో మరింత దిగజారి 16వ స్థానంలో నిలిచాడు. బాలచంద్ర 19వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఏపీ అమ్మాయి బొడ్డా ప్రత్యూష... వైషాలితో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకుంది. రాష్ట్రానికి చెందిన రవితేజ, రష్యా గ్రాండ్‌మాస్టర్ ఆటగాడు మొజరోవ్ మిఖాయిల్ చేతిలో, వైవీకే చక్రవర్తి... విశాఖ్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఓవరాల్‌గా ఆరు రౌండ్లు ముగిసిన తర్వాత భారత్‌కు చెందిన ఎస్‌పీ సేతురామన్ (5.5 పాయింట్లు) ఒక్కడే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత విదిత్ గుజరాతీ (4.5-ఆరో స్థానం) ఒక్కడే టాప్-10 ఉన్న భారత ఆటగాడు.