ప్రపంచ రికార్డు బద్దలుకొట్టింది!
న్యూఢిల్లీ: భారత మహిళా షూటర్ అపూర్వి చండెలా సరికొత్త రికార్డుతో స్వర్ణ పతకం గెలిచింది. స్వీడిష్ కప్ గ్రాండ్ ప్రిక్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో 211.2 పాయింట్లు సాధించి సరికొత్త సృష్టించింది. చైనా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ యి సిలింగ్ 211 పాయింట్ల రికార్డును బ్రేక్ చేసింది. స్వీడన్ షూటర్లు ఆస్ట్రిడ్ స్టెఫెన్ సన్(207.6), స్టినె నీల్సన్(185.0) రజత, కంచు పతకాలు గెలిచారు.
రికార్డు ఫలితంతో కొత్త ఏడాదిని ప్రారంభించిన అపూర్వి ఇప్పటికే రియో ఒలింపిక్స్ అర్హత సాధించింది. స్వీడిష్ కప్ గ్రాండ్ ప్రిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల అపూర్వి ఆనందం వ్యక్తం చేసింది. రియో ఒలింపిక్స్ లో పతకం గెలవాలన్న తన సంకల్పం ఈ విజయంతో మరింత బలపడిందని పేర్కొంది. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.
అపూర్వి చండెలాకు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె అభినందనలు తెలిపారు. 'అభినందనలు. గొప్ప విజయం సాధించావు. నీలో ఇంకా శక్తి దాగుంది. నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా' అని ఆమె ట్వీట్ చేశారు.