Apurvi Chandela
-
వన్‌పవర్‌మెంట్
ఆట అంటేనే పవర్! షాట్ కొట్టడానికి పవర్. క్యాచ్ పట్టడానికి పవర్. షూట్ చెయ్యడానికి పవర్. లాగి వదలడానికి పవర్. పావులు కదపడానికి పవర్. పంచ్ ఇవ్వడానికి పవర్. స్ట్రయికర్ని విసరడానికి పవర్. అన్నిటా ఎంపవర్మెంట్ని సాధించిన మహిళలు ఆటల్లోనూ తమ పవర్ చూపిస్తున్నారు. నెంబర్ వన్ స్థానంతో విజయానికే వన్‌పవర్‌మెంట్ తెస్తున్నారు. తల్లి కలనునిజం చేయాలని! సైనా (బ్యాడ్మింటన్) పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ ఆటగాళ్లుగా వెలుగొందిన వారు తెరమరుగై... భారత బ్యాడ్మింటన్ ఉనికి ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో తన విజయాలతో కొత్త ఉత్తేజాన్ని తెచ్చింది సైనా నెహ్వాల్. 2008లో జూనియర్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించి తన ముద్ర చాటుకున్నాక వరుస విజయాలు సాధిస్తూ భారత బ్యాడ్మింటన్ ముఖచిత్రాన్ని మార్చేసింది. హరియాణాలోని హిస్సార్‌లో జన్మించిన సైనా... తండ్రి హర్వీర్ సింగ్ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు బదిలీ కావడంతో భాగ్యనగరంలో స్థిరపడింది. సైనా తల్లిదండ్రులు హర్వీర్, ఉషా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులు. ఎనిమిదేళ్లకు రాకెట్ పట్టిన సైనా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకున్న తన తల్లి ఉషా కలను నిజం చేసింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తర్వాత సైనా అంతర్జాతీయస్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. 2015లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. ఎంతోమంది అమ్మాయిలు ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకునేందుకు ప్రేరణగా నిలిచింది. స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకొని! అపూర్వీ చండేలా (షూటింగ్) మహిళల షూటింగ్ క్రీడలో భారత్ నుంచి అంజలి భగవత్, సుమా షిరూర్, తేజస్విని సావంత్, హీనా సిద్ధూ తదితరులు అంతర్జాతీయస్థాయిలో మెరిశారు. వారి అడుగుజాడల్లోనే నడుస్తూ భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తోంది అపూర్వీ చండేలా. జైపూర్‌కు చెందిన 27 ఏళ్ల అపూర్వీ తొలుత ఆటలకంటే చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టేది. కెరీర్లో స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకున్న అపూర్వీని 2008 బీజింగ్ ఒలింపిక్స్ మార్చేశాయి. షూటర్ అభినవ్ బింద్రా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణం సాధించడం... ఆ తర్వాత బింద్రాకు లభించిన పేరు ప్రతిష్టలు అపూర్వీ మనసు మార్చేశాయి. బింద్రా స్ఫూర్తితో షూటింగ్ వైపు మళ్లిన అపూర్వీ 2012లో జాతీయ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి భారత జట్టుకు ఎంపికైంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకం సాధించిన ఆమె... 2018 కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో కాంస్యాలు గెలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇక 2019లో పసిడి పతకాల పంట పండించింది. మూడు ప్రపంచకప్‌లలో స్వర్ణాలు నెగ్గిన అపూర్వీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. మకుటంలేని మహరాణి! హంపి (చెస్) మేధో క్రీడ చదరంగంలో అమ్మాయిలు కూడా అద్భుతాలు చేయగలరని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి నిరూపించింది. ఐదేళ్ల ప్రాయంలో తండ్రి అశోక్ ప్రోత్సాహంతో చెస్‌లో ఓనమాలు నేర్చుకున్న హంపి 1997లో అండర్–10 బాలికల ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. 1998లో అండర్–12... 2000లో అండర్–14 విభాగంలో ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2002లో గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన హంపి 2006 దోహా ఆసియా క్రీడల్లో వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించింది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలు నెగ్గిన హంపి 2016లో తల్లి అయ్యాక రెండేళ్లపాటు ఆటకు విరామం చెప్పింది. 2018లో పునరాగమనం చేశాక... కొన్ని టోర్నీలలో నిరాశాజనక ఫలితాలు వచ్చినా 2019లో ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి రెండు టోర్నీల్లో విజేతగా నిలిచింది. డిసెంబర్లో మాస్కోలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి మహిళల విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఈ ఏడాది అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్ టోర్నీలోనూ చాంపియన్‌గా నిలిచి కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌ను అందుకుంది. నాన్న స్వప్నాన్ని సాకారం చేస్తూ! షఫాలీ వర్మ (క్రికెట్) భారత్‌లో పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కు ఆదరణ అంతంత మాత్రమే ఉన్నా... అవకాశం దొరికినపుడల్లా మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ వేదికపై అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. హరియాణాకు చెందిన 16 ఏళ్ల టీనేజర్ షఫాలీ వర్మ గతేడాది చివర్లో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. 15 ఏళ్లకే భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందిన షఫాలీ... గత నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 73 పరుగులు చేసింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో పిన్న వయస్సులో అర్ధ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో 30 ఏళ్లుగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును ఆమె బద్దలు కొట్టింది. తన కూతురు ఏనాటికైనా భారత జట్టుకు ఆడాలని కలలు కన్న తండ్రి సంజీవ్ స్వప్నాన్ని షఫాలీ తొందరగానే నిజం చేసి చూపించింది. అంతేకాకుండా తన విధ్వంసకర ఆటతో తొలిసారి భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడంలో ముఖ్యపాత్ర పోషించింది. ఎన్నో...ఎన్నెన్నో! సానియా మీర్జా (టెన్నిస్) ప్రపంచ మహిళల టెన్నిస్ పటంలో సానియా మీర్జా పుణ్యమాని భారత్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆరేళ్ల చిరుప్రాయంలో రాకెట్ పట్టిన సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా పర్యవేక్షణలో అంచెలంచెలుగా ఎదిగింది. 2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ విభాగంలో మూడో రౌండ్‌కు చేరిన సానియా... 2007లో సింగిల్స్‌లో కెరీర్ బెస్ట్ 27వ ర్యాంక్ సాధించింది. సానియా 2009లో మహేశ్ భూపతితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో... 2012లో మహేశ్ భూపతితో కలిసి ఫ్రెంచ్ ఓపెన్‌లో... 2014లో బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జతగా యూఎస్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ సొంతం చేసుకుంది. గాయాల బారిన పడటంతో 2012లో సింగిల్స్‌కు గుడ్‌బై చెప్పి డబుల్స్పైనే దృష్టి సారించిన ఈ హైదరాబాదీ... స్విట్జర్లాండ్ మేటి క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో జతకట్టి గొప్ప విజయాలు సాధించింది. 2015 ఏప్రిల్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్న ఆమె అదే ఏడాది హింగిస్‌తో జతగా వింబుల్డన్, యూఎస్ ఓపెన్... 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2018లో తల్లి అయిన సానియా రెండేళ్లపాటు ఆటకు దూరమైంది. ఈ ఏడాది మళ్లీ బరిలోకి దిగిన 33 ఏళ్ల సానియా హోబర్ట్ ఓపెన్ టోర్నీలో నదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి టైటిల్ నెగ్గి పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. అర్జున అవార్డు (2004), పద్మశ్రీ (2006), రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న (2015), పద్మభూషణ్ (2016) పురస్కారాలు అందుకున్న సానియా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఆఫ్రో–ఆసియా క్రీడలు కలిపి మొత్తం ఆరు స్వర్ణాలు సహా 14 పతకాలు సాధించింది. ‘పంచ్’ మే దమ్ హై మేరీకోమ్ (బాక్సింగ్) క్రీడాకారిణిగా, ముగ్గురు పిల్లల తల్లిగా, భార్యగా, కూతురుగా, పార్లమెంటేరియన్‌గా... ఇలా ఎన్నో బాధ్యతలు మోస్తూనే దాదాపు రెండు దశాబ్దాలుగా బాక్సింVŠ రింగ్‌లో తన పంచ్ పవర్ చాటుకుంటోంది మణిపూర్ మెరిక మేరీకోమ్. 37 ఏళ్ల మేరీకోమ్ భారత్‌లో మహిళల బాక్సింగ్‌కు ప్రతిరూపం. వేర్వేరు వెయిట్ కేటగిరీల్లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలువడంతోపాటు ఒలింపిక్స్‌లో, ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్‌లో ఇలా ప్రతి మెగా ఈవెంట్లో బరిలోకి దిగితే పతకంతో తిరిగొస్తూ ఎందరికో స్ఫూర్తి ప్రదాతలా నిలుస్తోంది. ‘అర్జున అవార్డు’.. ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’... ‘పద్మశ్రీ’.. ‘పద్మభూషణ్’.. ‘పద్మవిభూషణ్’.. ఇలా అన్ని అవార్డులు మేరీకోమ్‌ను వరించాయి. ఈ ఏడాది జూలై–ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి మేరీకోమ్ తన ఉజ్వల కెరీర్‌కు ఫినిషింగ్ టచ్ ఇవ్వాలనుకుంటోంది. సరదాగా మొదలై! అపూర్వ (క్యారమ్) వేసవి సెలవుల్లోనే కాకుండా తీరిక దొరికినపుడల్లా క్యారమ్ బోర్డు ఆట ఆడిన వాళ్లు ఎందరో ఉంటారు. ఇంటి ఆటలోనూ విశ్వవిజేత కావొచ్చని హైదరాబాద్‌కు చెందిన ఎస్.అపూర్వ నిరూపించింది. ఒకవైపు భారత జీవితబీమా సంస్థ (ఎల్ఐసీ)లో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు క్యారమ్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచి అపూర్వ అందరిచేతా శభాష్ అనిపించుకుంది. తన తండ్రి ఆయన మిత్రులతో సరదాగా క్యారమ్ ఆడుతున్నపుడు ఈ ఆటపట్ల ఆసక్తి పెంచుకున్న అపూర్వ ఆ తర్వాత ముందుకు దూసుకుపోయింది. 2004లో కొలంబోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన అపూర్వ... 2016లో బర్మింగ్హమ్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏకంగా సింగిల్స్, డబుల్స్, టీమ్ విభాగాల్లో పసిడి పతకాలు సొంతం చేసుకుంది. ఆట ఏదైనా, వయస్సుతో నిమిత్తం లేకుండా పట్టుదలతో కృషి చేస్తే అద్భుతాలు చేయవచ్చని అపూర్వ నిరూపించింది. ఆటో డ్రైవర్ అమ్మాయి! దీపిక కుమారి (ఆర్చరీ) మహిళా విలువిద్య (ఆర్చరీ)లో భారత్ పేరు దశదిశలా వ్యాప్తి చెందేలా చేసిన క్రీడాకారిణి దీపిక కుమారి. జార్ఖండ్‌కు చెందిన 26 ఏళ్ల దీపికకు ఎలాంటి క్రీడా నేపథ్యం లేకపోయినా స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత శిఖరాన్ని అధిరోహించింది. దీపిక తండ్రి శివనారాయణ్ మహతో ఆటో డ్రైవర్‌కాగా... తల్లి గీతా మహతో రాంచీ మెడికల్ కాలేజీలో నర్సుగా పని చేస్తున్నారు. చిన్న వయస్సులోనే ఆర్చరీపై ఆసక్తి పెంచుకున్న దీపికకు సరైన సామాగ్రి అందుబాటులో లేకపోయేది. అయినా ఆమె నిరాశ చెందలేదు. తమ ఊర్లోని మామిడి తోటల్లో మామిడి కాయలను గురి చూసి రాళ్లతో కొట్టేది. 2005లో ఖర్సావన్ పట్టణంలోని అర్జున్ ఆర్చరీ అకాడమీలో... కొన్నాళ్ల తర్వాత జమ్షెడ్పూర్లోని టాటా ఆర్చరీ అకాడమీలో దీపిక శిక్షణ తీసుకుంది. 2009లో 15 ఏళ్ల ప్రాయంలో అమెరికాలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో దీపిక స్వర్ణ పతకాన్ని నెగింది. ఆ తర్వాత దీపిక వెనుదిరిగి చూడలేదు. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో దీపిక రికర్వ్ వ్యక్తిగత, మహిళల టీమ్ విభాగాల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించింది. 2012లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన ప్రపంచకప్‌లో దీపిక స్వర్ణ పతకం సాధించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా ఆర్చర్‌గా గుర్తింపు పొందింది. దీపిక ఓవరాల్‌గా ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 41 పతకాలు సొంతం చేసుకుంది. – కరణం నారాయణ -
అపూర్వీ పసిడి గురి
మ్యూనిక్ (జర్మనీ): ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత షూటర్ అపూర్వీ చండేలా మళ్లీ మెరిసింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అపూర్వీ విజేతగా నిలిచింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య 24 షాట్లతో ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అపూర్వీ 251 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. వాంగ్ లుయావో (చైనా–250.8 పాయింట్లు) రజతం గెల్చుకోగా... జు హాంగ్ (చైనా–229.4 పాయింట్లు) కాంస్య పతకం కైవసం చేసుకుంది. ప్రపంచకప్ టోర్నమెంట్లలో ఈ ఏడాది అపూర్వీకిది రెండో స్వర్ణం. ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచకప్‌లోనూ అపూర్వీ పసిడి పతకం సాధించింది.స్వర్ణం కోసం అపూర్వీ, వాంగ్ లుయావో మధ్య హోరాహోరీ పోరు జరిగింది. నిర్ణీత 22 షాట్ల తర్వాత అపూర్వీ 230.4 పాయింట్లతో, వాంగ్ 229.9 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 23వ షాట్లో అపూర్వీ 10.2 పాయింట్లు... వాంగ్ 10.6 పాయింట్లు సాధించారు. దాంతో చివరి షాట్‌కు ముందు అపూర్వీ (240.6 పాయింట్లు), వాంగ్ (240.5 పాయింట్లు) మధ్య వ్యత్యాసం కేవలం 0.1 పాయింట్లుగా ఉంది. ఆఖరి షాట్లో అపూర్వీ 10.4 స్కోరు చేయగా... వాంగ్ 10.3తో సరిపెట్టుకుంది. ఫలితంగా అపూర్వీ 0.2 పాయింట్ల తేడాతో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. ఫైనల్లో పోటీపడిన భారత్‌కే చెందిన మరో షూటర్ ఇలవేనిల్ వలారివన్ (208.3 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది. అంతకుముందు 149 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో అపూర్వీ 633 పాయింట్లు సాధించి టాప్ ర్యాంక్‌లో, ఇలవేనిల్ వలారివన్ 632.7 పాయింట్లు సాధించి రెండో ర్యాంక్‌లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్‌లో టాప్–8లో నిలిచిన వారు ఫైనల్లో పోటీపడతారు. -
ప్రపంచ నంబర్‌వన్ అపూర్వీ
న్యూఢిల్లీ: కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తోన్న భారత మహిళా షూటర్ అపూర్వీ చండేలా మరో మైలురాయిని అందుకుంది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అపూర్వీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అపూర్వీ 1926 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. భారత్‌కే చెందిన మరో రైఫిల్ షూటర్ అంజుమ్ మౌద్గిల్ 1695 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉంది. గత ఫిబ్రవరిలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో అపూర్వీ 252.9 పాయింట్ల స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన ఈ రాజస్తాన్ షూటర్... 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం కైవసం చేసుకుంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న అపూర్వీ ఇటీవల బీజింగ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత యువ షూటర్ దివ్యాన్‡్ష సింగ్ పన్వర్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ వర్మ 16వ స్థానం నుంచి మూడో ర్యాంక్‌కు చేరుకోగా... సౌరభ్ నాలుగో ర్యాంక్ నుంచి ఆరో స్థానానికి పడిపోయాడు. పురుషుల ట్రాప్ విభాగం ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ షూటర్ కైనన్ షెనాయ్ 24వ ర్యాంక్ నుంచి 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. -
వరల్డ్ రికార్డుతో ‘తొలి’ స్వర్ణం
న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో భారత పసిడి వేట కొనసాగుతోంది. శనివారం ఆరంభమైన షూటింగ్ వరల్డ్‌కప్‌లో భారత మహిళా షూటర్ అపూర్వి చండేలా సరికొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణం సాధించగా, ఆదివారం భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి పసిడి పతకం సాధించాడు. తొలిసారి సీనియర్ విభాగంలో వరల్డ్‌కప్‌లో పాల్గొన సౌరభ్.. వరల్డ్ రికార్డు స్కోరుతో స్వర్ణం గెలుచుకున్నాడు. ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో 245.0 పాయింట్లతో సౌరభ్ చౌదరి వరల్డ్ రికార్డు సాధించాడు. (ఇక్కడ చదవండి: ప్రపంచ రికార్డు... పసిడి పతకం) ఫైనల్లో పొడియం పొజిషన్‌ను సాధించిన సౌరభ్ కడవరకూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే సెర్బియాకు చెందిన స్టార్ షూటర్ దామిర్ మికెక్పై వెనుక్కినెట్టి పసిడితో మెరిశాడు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సౌరభ్ కొట్టిన ప్రతీ షాట్ 10 పాయింట్ల కంటే ఎక్కువ ఉండటం విశేషం. ఫలితంగా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు బెర్తును ఖాయం చేసుకున్నాడు. గతేడాది జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో సౌరభ్ స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ విభాగంలో కూడా వరల్డ్ రికార్డు సౌరభ్ చౌదరి పేరిటే ఉంది. నిన్న మొదలైన ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత మహిళా షూటర్ అపూర్వి చండేలా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో 26 ఏళ్ల అపూర్వి ఫైనల్లో 252.9 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో అపూర్వి 252.4 పాయింట్లతో గతేడాది ఏప్రిల్‌లో చైనా షూటర్ రుజు జావో సాధించిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. -
ప్రపంచ రికార్డు... పసిడి పతకం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ కొత్త సీజన్‌ను భారత్ పసిడి పతకం, ప్రపంచ రికార్డుతో ప్రారంభించింది. శనివారం మొదలైన ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత మహిళా షూటర్ అపూర్వి చండేలా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో 26 ఏళ్ల అపూర్వి ఫైనల్లో 252.9 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో అపూర్వి 252.4 పాయింట్లతో గతేడాది ఏప్రిల్‌లో చైనా షూటర్ రుజు జావో సాధించిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ టోర్నీలో రుజు జావో 251.8 పాయింట్లు స్కోరు చేసి రజతం నెగ్గగా... హాంగ్ జు (చైనా–230.4 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకుంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫయింగ్ ఈవెంట్ అయినప్పటికీ గతేడాదే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ గరిష్టంగా రెండు బెర్త్‌లు ఖాయం చేసుకోవడంతో అపూర్వి తాజా ప్రదర్శనకు ఒలింపిక్ బెర్త్ రాలేదు. క్వాలిఫయింగ్‌లో నాలుగో స్థానం... మొత్తం 101 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో అపూర్వి 629.3 పాయింట్లు సాధించి నాలుగో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించింది. టాప్–8లో నిలిచిన వారు 24 షాట్లతో కూడిన ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అపూర్వి కొట్టిన ప్రతీ షాట్ 10 పాయింట్ల కంటే ఎక్కువ ఉండటం విశేషం. నిబంధనల ప్రకారం తొలి 12 షాట్లు పూర్తయ్యాక ఎనిమిది మందిలో తక్కువ స్కోరు ఉన్న షూటర్ నిష్క్రమిస్తారు. ఆ తర్వాత ప్రతి రెండు షాట్లకు తక్కువ స్కోరుతో ఉన్న షూటర్ పతకం రేసు నుంచి వెనుదిరిగారు. స్వర్ణం–రజతం కోసం చివరి రెండు షాట్లు మిగిలే సమయానికి అపూర్వి (231.6), రుజు జావో (230.8) మధ్య తేడా 0.8 మాత్రమే ఉంది. చివరి రెండు షాట్లలో అపూర్వి వరుసగా 10.8; 10.5... రుజు జావో 10.5; 10.5 స్కోరు చేశారు. దాంతో 1.1 స్కోరు తేడాతో అపూర్వికి స్వర్ణం ఖాయమైంది. భారత్‌కే చెందిన ఎలవెనిల్ వలరివాన్ (628 పాయింట్లు) 12వ స్థానంలో... అంజుమ్ మౌద్గిల్ (625.3 పాయింట్లు) 30వ స్థానంలో నిలిచారు. ► 3 ప్రపంచకప్ టోర్నీల్లో అపూర్వి నెగ్గిన పతకాలు. కొరియాలో 2015 జరిగిన ఈవెంట్లో ఆమె కాంస్యం, అదే ఏడాది వరల్డ్ కప్ ఫైనల్స్ టోర్నీలో రజతం సాధించింది. -
స్వర్ణంతో మెరిసిన అపూర్వి
న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. భారత స్టార్ షూటర్ అపూర్వి చండీలా రైఫిల్ అండ్ పిస్టల్ విభాగంలో పసిడి గెలుచుకున్నారు. శనివారం ఆరంభమైన షూటింగ్ వరల్డ్‌కప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అపూర్వి స్వర్ణాన్ని సాధించారు. సరికొత్త రికార్డుతో అపూర్వి పసిడి గెలుచుకోవడం విశేషం. ఫైనల్లో మొత్తం 252. 9 పాయింట్లతో కొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పిన అపూర్వి పసిడితో మెరిశారు. ఫలితంగా వరల్డ్‌కప్ షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న రెండో భారత షూటర్‌గా అపూర్వి నిలిచారు. అంతకముందు అంజలీ భగవత్ ఈ ఫీట్ సాధించారు. కాగా, ఇది వరల్డ్‌కప్‌లో అపూర్వికి మూడో పతకం. గత ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో అపూర్వి రజత పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. తాజా వరల్డ్‌కప్ షూటింగ్లో రజత, కాంస్య పతకాలు చైనా దక్కించుకుంది. జొహో రుజు(251.8 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజతాన్ని దక్కించుకోగా, మరో చైనా షూటర్ ఝు హాంగ్(230.4) కాంస్యాన్ని దక్కించుకున్నారు. -
భారత్‌కు 2 రజతాలు
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ సీనియర్ విభాగంలో భారత్ ఖాతా తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో భారత్‌కు రజత పతకాలు లభించాయి. వ్యక్తిగత విభాగంలో అంజుమ్ మౌద్గిల్ (248.4 పాయింట్లు) రజతం నెగ్గగా... అంజుమ్, అపూర్వీ చండేలా, మెహులీ ఘోష్‌లతో కూడిన భారత జట్టు (1879 పాయింట్లు) రజతం సాధించింది. అపూర్వీ చండేలా (207 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది. అంజుమ్, అపూర్వీ టాప్–4లో నిలిచినందుకు భారత్‌కు 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రెండు బెర్త్‌లు ఖరారయ్యాయి. -
ఆసియన్ గేమ్స్‌లో భారత్ బోణీ
-
షూటింగ్: భారత మహిళల గురి అదుర్స్!
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. వరుసగా ఐదోరోజు భారత ఆటగాళ్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత మహిళా షూటర్లు రజతం, కాంస్య పతకాలు సాధించారు. మెహులి ఘోష్ రజతం నెగ్గగా, అదే విభాగంలో అపూర్వి చండేలా కాంస్యం కైవసం చేసుకున్నారు. టాప్ పొజిషన్లో నిలిచిన సింగపూర్‌కు చెందిన లిండ్సే వెలోసో స్వర్ణం అందుకున్నారు. ఇప్పటివరకూ 8 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్య పతకాలు కొల్లగొట్టిన భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నేటి ఉదయం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు చెందిన జీతూరాయ్ స్వర్ణం గెలుచుకోగా, ఓమ్ ప్రకాశ్ మితర్వాల్ కాంస్యంతో సాధించిన విషయం తెలిసిందే. -
అపూర్వీకి మరో స్వర్ణం
షూటర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపిక న్యూఢిల్లీ: భారత మహిళా షూటర్ అపూర్వీ చండీలా స్వీడిష్ కప్ గ్రాండ్ ప్రిలో తన అద్భుత ప్రదర్శన మరోసారి కొనసాగించింది. గురువారం జరిగిన 10 మీ. ట్రై సిరీస్ ఈవెంట్ ఫైనల్లోనూ 208.9 పాయింట్లతో స్వర్ణం కొల్లగొట్టింది. మంగళవారం నాటి పోటీలో 10 మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ రికార్డుతో పాటు స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి 23 ఏళ్ల చండీలా ‘షూటర్ ఆఫ్ ద టోర్నీ’గా ఎంపికైంది. అలాగే ఈ రాజస్తానీ షూటర్‌కు వాల్తెర్ రైఫిల్‌ను బహుమానంగా అందించారు. -
ప్రపంచ రికార్డు బద్దలుకొట్టింది!
న్యూఢిల్లీ: భారత మహిళా షూటర్ అపూర్వి చండెలా సరికొత్త రికార్డుతో స్వర్ణ పతకం గెలిచింది. స్వీడిష్ కప్ గ్రాండ్ ప్రిక్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో 211.2 పాయింట్లు సాధించి సరికొత్త సృష్టించింది. చైనా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ యి సిలింగ్ 211 పాయింట్ల రికార్డును బ్రేక్ చేసింది. స్వీడన్ షూటర్లు ఆస్ట్రిడ్ స్టెఫెన్ సన్(207.6), స్టినె నీల్సన్(185.0) రజత, కంచు పతకాలు గెలిచారు. రికార్డు ఫలితంతో కొత్త ఏడాదిని ప్రారంభించిన అపూర్వి ఇప్పటికే రియో ఒలింపిక్స్ అర్హత సాధించింది. స్వీడిష్ కప్ గ్రాండ్ ప్రిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల అపూర్వి ఆనందం వ్యక్తం చేసింది. రియో ఒలింపిక్స్ లో పతకం గెలవాలన్న తన సంకల్పం ఈ విజయంతో మరింత బలపడిందని పేర్కొంది. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. అపూర్వి చండెలాకు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె అభినందనలు తెలిపారు. 'అభినందనలు. గొప్ప విజయం సాధించావు. నీలో ఇంకా శక్తి దాగుంది. నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా' అని ఆమె ట్వీట్ చేశారు. -
అపూర్వి.. అదుర్స్
ప్రపంచకప్ షూటింగ్లో రజతం మునిచ్ : భారత యువ షూటర్ అపూర్వి చండేలా... ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ రైఫిల్ అండ్ పిస్టల్ ఈవెంట్లో సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అపూర్వి 206.9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకుంది. స్వర్ణం నెగ్గిన అహ్మది ఎల్హాన్ (ఇరాన్-207.5)కు ఈమెకు మధ్య తేడా కేవలం 0.6 పాయింట్లు మాత్రమే. ఆండ్రియా (సెర్బియా)కు కాంస్యం దక్కింది. ఫైనల్లో చండేలా ఆరంభం నుంచే ఆధిపత్యం చూపెట్టింది. రెండుసార్లు 10.8 పాయింట్లు సాధించి సిరీస్-1లో మొత్తం 30.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే రెండో సిరీస్‌లో నిలకడ లేకపోవడంతో ఒక్క స్థానం కిందకు పడిపోయింది. ఫైనల్ షాట్లో చండేలా 10.2 పాయింట్లు నెగ్గితే.... ఎల్హాన్ 10.4 పాయింట్లు సాధించింది. -
మహిళా షూటర్ కు రజత పతకం
భారతీయ మహిళా షూటర్ అపూర్వీ చందిలా మహిళల 10 మీటర్ల రైఫిల్ విభాగంలో సత్తా చాటింది. ఇక్కడ జరుగుతున్న షూటింగ్ ప్రపంచ కప్ ఫైనల్లో రజత పతకం సాధించింది. జైపూర్ కి చెందిన ఈ 22ఏళ్ల షూటర్ ఫైనల్ లో 206.9 పాయింట్లు సాధించి రెండో స్తానంలో నిలిచింది. కాగా ఇరాన్ కు చెందిన అహ్మది 207.5పాయింట్లతో బంగారు పతకం సాధించింది. దీంతో ఈ కామన్ వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. -
అపూర్వీకి కాంస్యం
రియో ఒలింపిక్స్‌కు అర్హత చాంగ్‌వన్ (కొరియా): భారత మహిళా షూటర్ అపూర్వీ చండేలా ఒకే గురికి రెండు లక్ష్యాలను సాధించింది. ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈ రాజస్థాన్ షూటర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. తద్వారా వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. ఎనిమిది మంది పోటీపడిన ఫైనల్స్‌లో అపూర్వీ 185.6 పాయింట్ల స్కోరుతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. స్నెజానా పెజ్‌సిచ్ (క్రొయేషియా-209.1 పాయింట్లు) స్వర్ణం, ఇవానా మఖ్సిమోవిచ్ (సెర్బియా-207.7 పాయింట్లు) రజతం సాధించారు. జీతూ రాయ్ తర్వాత రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన రెండో భారతీయ షూటర్ అపూర్వీ. -
స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకున్నాను!
- అపూర్వి చండేలా, షూటర్ చిన్నప్పటి నుంచి ఆటలు అంటే చాలా ఇష్టం. బాస్కెట్ బాల్ బాగా ఆడేదాన్ని. స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకునేదాన్ని. అభినవ్ బింద్రా ఒలింపిక్ గోల్డ్ గెలుచుకున్న తరువాత అది చాలామందిలో స్ఫూర్తి నింపింది. అందులో నేను కూడా ఒకరిని. షూటర్ కావాలనుకోవడానికి ఇదే కారణం. నా తల్లిదండ్రులు తమ కోరికలను నా మీద ఎప్పుడూ రుద్దలేదు. అభిరుచికి తగిన స్వేచ్ఛను ఇచ్చారు. కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకోవడానికి ఆ ప్రోత్సాహమే వెన్నుదన్నుగా నిలచింది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలుచుకోవడం నా జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పింది. అది మాటలకు అందని అద్భుత భావన. నా ఫస్ట్ నేషనల్ టైటిల్‌ను 2012లో గెలుచుకున్నాను. అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం నా లక్ష్యం... ఒలింపిక్స్‌లో క్వాలిఫై కావడం. రోజూ యోగా, ధ్యానం చేస్తాను. చాలా దూరం పరుగెడతాను. ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఏమాత్రం వీలున్నా కొత్త ప్రదేశాలు చూడడానికి ప్రాధాన్యత ఇస్తాను. -
షూటింగ్ లో భారత్ కు మరో స్వర్ణం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ షూటర్లు మెరుస్తున్నారు. 2014 కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా గ్లాస్గో లో శనివారం రాత్రి జరిగిన మహిళల షూటింగ్లో భారత్ మరో రెండు పతకాలను కైవసం చేసుంది. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రాహీ సర్నోబాత్ కు స్వర్ణం దక్కగా, అనిషా సయ్యద్ కు రజత పతకం లభించింది. అంతకుముందు జరిగిన మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ కు రెండు పతకాలు వరించాయి. అపూర్వి చండేలా, అయోనికా పాల్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి పసిడి, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. అపూర్వి చండేలా 206.7 పాయింట్లు, అయోనికా పాల్ 204.9 పాయింట్లు సాధించి ఇతరులకు అందనంత దూరంలో నిలిచారు. పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ షూటర్ ప్రకాశ్ నంజప్ప రజత పతకం సాధించగా, శుక్రవారం జరిగిన పోటీల్లో భారత షూటర్లు అభినవ్ బింద్రా స్వర్ణం, మలైకా గోయెల్ రజతం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత షూటర్లు ఇప్పటివరకు ఏడు పతకాలను కైవసం చేసుకున్నారు. ఇప్పటివరకూ భారత్ 15 పతకాలను చేజిక్కించుకుని పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఐదు బంగారు పతకాలు, ఏడు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. -
షూటింగ్లో భారత్ అమ్మాయిలు భళా
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. షూటింగ్లో భారత్‌కు మరో మూడు పతకాలు వచ్చాయి. శనివారం జరిగిన మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మరో రెండు పతకాలు వరించాయి. భారత షూటర్లు అపూర్వి చండేలా, అయోనికా పాల్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి పసిడి, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. అపూర్వి చండేలా 206.7 పాయింట్లు, అయోనికా పాల్ 204.9 పాయింట్లు సాధించి ఇతరులకు అందనంత దూరంలో నిలిచారు. ఇదే ఈవెంట్లో మూడో స్థానంతో కాంస్యం గెల్చుకున్న నుర్ సుర్యానీ 184.4 పాయింట్లే నెగ్గడం గమనార్హం. పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ షూటర్ ప్రకాశ్ నంజప్ప రజత పతకం సాధించగా, శుక్రవారం జరిగిన పోటీల్లో భారత షూటర్లు అభినవ్ బింద్రా స్వర్ణం, మలైకా గోయెల్ రజతం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత షూటర్లు ఇప్పటివరకు ఐదు పతకాలు కైవసం చేసుకున్నారు.