అపూర్వీ పసిడి గురి | Apurvi Chandela bags 10m air rifle gold in ISSF World Cup | Sakshi
Sakshi News home page

అపూర్వీ పసిడి గురి

Published Mon, May 27 2019 4:17 AM | Last Updated on Mon, May 27 2019 4:17 AM

Apurvi Chandela bags 10m air rifle gold in ISSF World Cup - Sakshi

మ్యూనిక్‌ (జర్మనీ): ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న భారత షూటర్‌ అపూర్వీ చండేలా మళ్లీ మెరిసింది. అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో అపూర్వీ విజేతగా నిలిచింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య 24 షాట్‌లతో ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అపూర్వీ 251 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. వాంగ్‌ లుయావో (చైనా–250.8 పాయింట్లు) రజతం గెల్చుకోగా... జు హాంగ్‌ (చైనా–229.4 పాయింట్లు) కాంస్య పతకం కైవసం చేసుకుంది.

ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లలో ఈ ఏడాది అపూర్వీకిది రెండో స్వర్ణం. ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచకప్‌లోనూ అపూర్వీ పసిడి పతకం సాధించింది.స్వర్ణం కోసం అపూర్వీ, వాంగ్‌ లుయావో మధ్య హోరాహోరీ పోరు జరిగింది. నిర్ణీత 22 షాట్‌ల తర్వాత అపూర్వీ 230.4 పాయింట్లతో, వాంగ్‌ 229.9 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 23వ షాట్‌లో అపూర్వీ 10.2 పాయింట్లు... వాంగ్‌ 10.6 పాయింట్లు సాధించారు. దాంతో చివరి షాట్‌కు ముందు అపూర్వీ (240.6 పాయింట్లు), వాంగ్‌ (240.5 పాయింట్లు) మధ్య వ్యత్యాసం కేవలం 0.1 పాయింట్లుగా ఉంది.

ఆఖరి షాట్‌లో అపూర్వీ 10.4 స్కోరు చేయగా... వాంగ్‌ 10.3తో సరిపెట్టుకుంది. ఫలితంగా అపూర్వీ 0.2 పాయింట్ల తేడాతో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. ఫైనల్లో పోటీపడిన భారత్‌కే చెందిన మరో షూటర్‌ ఇలవేనిల్‌ వలారివన్‌ (208.3 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది. అంతకుముందు 149 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో అపూర్వీ 633 పాయింట్లు సాధించి టాప్‌ ర్యాంక్‌లో, ఇలవేనిల్‌ వలారివన్‌ 632.7 పాయింట్లు సాధించి రెండో ర్యాంక్‌లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్‌లో టాప్‌–8లో నిలిచిన వారు ఫైనల్లో పోటీపడతారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement