
అర్జెంటీనా అదుర్స్...
ఎట్టకేలకు డేవిస్‌కప్ సొంతం
ఐదో ప్రయత్నంలో సఫలం
ఫైనల్లో క్రొయేషియాపై 3-2తో గెలుపు
జాగ్రెబ్ (క్రొయేషియా): ఒకటి కాదు... రెండు కాదు.. మూడు కాదు... ఏకంగా నాలుగుసార్లు ఫైనల్‌కు చేరుకున్నా... ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఊరిస్తోన్న డేవిస్ కప్ పురుషుల ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను అర్జెంటీనా సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఫైనల్లో అర్జెంటీనా 3-2తో క్రొయేషియాపై విజయం సాధించింది. చివరిరోజు జరిగిన రెండు రివర్స్ సింగిల్స్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు గెలిచి తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. 1-2తో వెనుకబడి ఆదివారం తొలి రివర్స్ సింగిల్స్‌లో బరిలోకి దిగిన అర్జెంటీనాకు 2009 యూఎస్ ఓపెన్ చాంపియన్ యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు. 4 గంటల 53 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో డెల్‌పొట్రో 6-7 (4/7), 2-6, 7-5, 6-4, 6-3తో 2014 యూఎస్ ఓపెన్ చాంపియన్ మారిన్ సిలిచ్‌ను ఓడించాడు. దాంతో స్కోరు 2-2తో సమమైంది. ఈ మ్యాచ్‌లో సిలిచ్ 34 ఏస్‌లు సంధించి, 79 అనవసర తప్పిదాలు చేయగా... డెల్‌పొట్రో 16 ఏస్‌లు కొట్టి, 48 అనవసర తప్పిదాలు చేశాడు. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్ ఫెడెరికో డెల్‌బోనిస్ 6-3, 6-4, 6-2తో ప్రపంచ 20వ ర్యాంకర్ ఇవో కార్లోవిచ్‌ను ఓడించి అర్జెంటీనాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
1920లో నార్మన్ బ్రూక్స్ (43 ఏళ్లు) తర్వాత డేవిస్ కప్ మ్యాచ్‌లో ఆడుతున్న రెండో పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందిన 37 ఏళ్ల కార్లోవిచ్ కీలకపోరులో క్రొయేషియాను ఆదుకోలేకపోయాడు. 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 104 కేజీల బరువున్న కార్లోవిచ్ ఈ మ్యాచ్‌లో 42 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు డెల్‌బోనిస్ నాలుగుసార్లు కార్లోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి వరుస సెట్‌లలో విజయాన్ని అందుకున్నాడు. గతంలో అర్జెంటీనా 1981, 2006, 2008, 2011లలో ఫైనల్‌కు చేరుకున్నా ఓడిపోరుు రన్నరప్‌గా నిలిచింది. 116 ఏళ్ల డేవిస్‌కప్ చరిత్రలో విజేతగా నిలిచిన 15వ జట్టుగా అర్జెంటీనా గుర్తింపు పొందింది. అమెరికా అత్యధికంగా 35 సార్లు డేవిస్‌కప్ టైటిల్‌ను సాధించింది.