
అర్జెంటీనా అలవోకగా
బెల్జియంపై 1-0తో విజయం
ప్రపంచకప్‌లో తొలి రెండు క్వార్టర్ ఫైనల్స్‌తో పోలిస్తే... ఈసారి మెరుపుల్లేవ్. ప్రేక్షకులే కాదు... ప్రత్యర్థి డిఫెండర్లు కూడా మెస్సీపైనే దృష్టి పెడితే... అర్జెంటీనా స్ట్రయికర్ హిగుయాన్ కామ్‌గా ఆరంభంలోనే ఓ గోల్ వేసేశాడు. అంతే... ఇక బెల్జియం తేరుకోలేదు. కనీసం పోరాడలేదు. ఫలితంగా అర్జెంటీనా అలవోకగా నెగ్గింది. 1990 తర్వాత ఈ జట్టు తొలిసారి సెమీస్‌కు చేరడం విశేషం.
బ్రెజీలియా: ప్రస్తుత ప్రపంచకప్‌లో తమ జట్టు ఆలోచన లేకుండా ఆడుతోందన్న దిగ్గజ ఆటగాడు మారడోనా విమర్శలకు సమాధానమా.. అన్నట్టు అర్జెంటీనా జట్టు చెలరేగింది. మైదానంలోకి దిగిన మరుక్షణం నుంచే అటాకింగ్ గేమ్‌ను ప్రదర్శించి బెల్జియంను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫలితంగా శనివారం రాత్రి జరిగిన ఈ క్వార్టర్స్ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో నెగ్గింది. ఇది మెస్సీకి 91వ మ్యాచ్. దీంతో మారడోనా రికార్డును సమం చేశాడు. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హిగుయాన్ సాధించాడు.
మ్యాచ్ ఆరంభం నుంచే అర్జెంటీనా దూకుడు మంత్రం జపించింది. ఫలితంగా ఎనిమిదో నిమిషంలోనే ఫలితం దక్కింది. మిడ్ ఫీల్డ్ నుంచి స్ట్రయికర్ మెస్సీ బంతిని అద్భుతంగా డ్రిబ్లింగ్ చేసుకుంటూ డి మారియాకు పాస్ ఇచ్చాడు. దీన్ని వెంటనే అతను గోల్ పోస్టుకు ఎడమ వైపున్న మరో స్ట్రయికర్ గోంజలో హిగుయాన్‌కు అందించగా... ఆ బంతిని ఆపకుండా మెరుపు వేగంతో హిగుయాన్ బెల్జియం గోల్ కీపర్ అప్రమత్తం కాకముందే నెట్‌లోకి పంపాడు. దీంతో జట్టు 1-0 ఆధిక్యం సాధించింది.
13వ నిమిషంలో బెల్జియం మిడ్ ఫీల్డర్ కెవిన్ డి బ్రూనే కొట్టిన షాట్ గోల్ పోస్టు పక్కనుంచి వెళ్లిపోయింది.
28వ నిమిషంలో డి మారియా షాట్‌కు అతి సమీపం నుంచి బెల్జియం కెప్టెన్ కొంపనీ కాలు అడ్డుపెట్టి గోల్ అపాడు.
39వ నిమిషంలో గోల్ కోసం దూసుకొస్తున్న మెస్సీని నలుగురు డిఫెండర్లు అడ్డుకుని కిందపడేయడంతో ఫ్రీ కిక్ ఇచ్చారు. అయితే గోల్ పోస్టుకు మరీ సమీపంలో ఉండడంతో మెస్సీ కొట్టిన షాట్‌కు బంతి బార్ పైనుంచి వెళ్లింది.
ద్వితీయార్ధంలో గోల్స్ ఆధిక్యాన్ని పెంచేందుకు ప్రయత్నించిన అర్జెంటీనాకు 55వ నిమిషంలో చక్కటి అవకాశం లభించింది. 25 గజాల దూరం నుంచి బంతిని అదుపులో పెట్టుకుంటూ వచ్చిన హిగుయాన్.. తన షాట్‌ను కాస్త ఎత్తులో కొట్టడంతో బార్‌కు తగిలి పైకి వెళ్లింది.
ఆ తర్వాత కూడా ఇరు జట్లకు పలు అవకాశాలు లభించినా లక్షాన్ని సాధించలేకపోయాయి. అర్జెంటీనా సులభంగానే మ్యాచ్ గెలిచి సెమీస్‌కు చేరింది.