
అరుంధతి అదుర్స్
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ అండర్-19 మహిళల క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. గుంటూరులో శుక్రవారం ప్రారంభమైన ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో తమిళనాడును చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు 33.3 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. మహాలక్ష్మి (51 బంతుల్లో 22; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
హైదరాబాద్ కెప్టెన్ అరుంధతి రెడ్డి 9 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడం విశేషం. శ్రావణికి 2 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్ 16.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 67 పరుగులు చేసి విజయాన్నందుకుంది. స్నేహా మోరె (32 బంతుల్లో 28; 4 ఫోర్లు), రమ్య (52 బంతుల్లో 26 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు. ఈ విజయంతో హైదరాబాద్‌కు 4 పాయింట్లు దక్కాయి.
ఇక ఐప్యాడ్ స్కోరింగ్...
శుక్రవారం ప్రారంభమైన సౌత్‌జోన్ అండర్-19 మహిళల క్రికెట్ టోర్నమెంట్‌తో బీసీసీఐ కొత్త సాంకేతిక విధానానికి శ్రీకారం చుట్టింది. మైదానంలోని స్కోరర్లు నేరుగా అప్‌డేట్‌లు చేసేందుకు వీలుగా తొలిసారి ఐప్యాడ్‌ల ద్వారా స్కోరింగ్ చేసే పద్ధతిని ప్రారంభించింది. దీని వల్ల బోర్డు పరిధిలో నిర్వహించే అన్ని దేశవాళీ మ్యాచ్‌ల వివరాలను ‘లైవ్’గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందు కోసం బీసీసీఐ, అన్ని క్రికెట్ అసోసియేషన్లకు ఇంటర్‌నెట్ సౌకర్యంతో ఆరు చొప్పున ఐప్యాడ్‌లు అందజేసింది.
ఇటీవలే చెన్నైలో జరిగిన స్కోరర్ల సెమినార్‌లో ఈ టచ్ స్క్రీన్ టెక్నాలజీకి సంబంధించి అవగాహన కల్పించారు. ఇంటర్‌నెట్ లేని సమయంలో ఏదైనా అప్‌డేట్ చేసినా అది అందుబాటులోకి వచ్చిన అనంతరం దానంతట అదే మార్పులు చేసుకోవడం ఈ సిస్టం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ ఏడాది దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ సహా అన్ని మ్యాచ్‌లకు దీనిని అమల్లోకి తీసుకు రానున్నారు.
‘కలం, కాగితాన్ని పక్కన పెట్టి ఐప్యాడ్‌తో స్కోరింగ్ చేయడాన్ని కొత్త సాంకేతిక ప్రయోజనంగా చెప్పవచ్చు. ఇకపై క్రికెట్ వీరాభిమానులు అండర్-19 స్థాయిలో కూడా ప్రతీ బంతి ఎలా సాగిందనే విషయం తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచంలో మరే బోర్డు చేయని విధంగా బీసీసీఐ ఈ తరహాలో ప్రయోగం చేయడం సంతోషకరం’ అని సీనియర్ స్కోరర్ పి. చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.