
మళ్లీ అదే తడబాటు
పెర్త్: వరుసగా రెండు పరాజయాలతో కుదేలైన ఇంగ్లండ్ జట్టు మూడో టెస్టులోనూ ఇబ్బందిని ఎదుర్కొంటోంది. సిరీస్‌లో ఇప్పటిదాకా రాణించని కెప్టెన్ కుక్ (153 బంతుల్లో 72; 10 ఫోర్లు) రాణించినా... పెద్దగా ఫలితం కనిపించడం లేదు. రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 68 ఓవర్లలో నాలుగు వికెట్లకు 180 పరుగులు చేసింది.
ఓపెనర్ కార్‌బెర్రీ (76 బంతుల్లో 43; 8 ఫోర్లు; 1 సిక్స్) మాత్రమే ఆకట్టుకున్నాడు. పదునైన బంతులతో గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో పర్యాటక జట్టును బెంబేలెత్తించిన పేసర్ మిచెల్ జాన్సన్‌కు వికెట్లేమీ దక్కకపోయినా... హారిస్, వాట్సన్, సిడిల్, లియోన్ తలా ఓ వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో బెల్ (9 బ్యాటింగ్), స్టోక్స్ (43 బంతుల్లో 14 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఉన్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలో కుక్, కార్‌బెర్రీ నిలకడగా ఆడడంతో తొలి వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు కట్టడి చేయడంతో 146 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆసీస్‌కన్నా ఇంగ్లండ్ 205 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 326/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ మరో 59 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. స్మిత్ 111 పరుగులు చేశాడు.
మరోసారి డీఆర్‌ఎస్ గొడవ
అంపైర్ నిర్ణయ పునస్సమీక్షా పద్దతి (డీఆర్‌ఎస్) మరోసారి వివాదాస్పదమైంది. రెండో రోజు ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షేన్ వాట్సన్ బౌలింగ్‌లో కీపర్ హాడిన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీన్ని అంపైర్ మరైస్ ఎరాస్మస్ అవుట్‌గా ప్రకటించారు. అయితే రూట్ మాత్రం బంతి తన బ్యాట్‌కు తగల్లేదనే కారణంతో రివ్యూకు వెళ్లాడు.
మూడో అంపైర్ టోనీ హిల్ పలు పర్యాయాలు వీడియో క్లిప్స్ పరిశీలించినా స్పష్టత ఏర్పడలేదు. అటు హాట్‌స్పాట్‌లోనూ బ్యాట్‌కు బంతి తగిలినట్టు కనిపించలేదు. ఆడియో ఫుటేజిలో బ్యాట్ పక్క నుంచి బంతి వెళ్లిన అనంతరం శబ్దం వినిపించింది. దీంతో ఏదీ సరైన రీతిలో తేలకపోవడంతో థర్డ్ అంపైర్ హిల్ కూడా రూట్ అవుట్‌ను ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే వదిలేశారు.