
న్యూఢిల్లీ:దాదాపు 14 ఏళ్ల క్రితం విరాట్ కోహ్లికి ఆశిష్ నెహ్రా బహుమతి అందజేస్తున్న ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. న్యూజిలాండ్ తో తొలి టీ 20 అనంతరం ఆశిష్ నెహ్రా తన అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు చెప్పిన క్రమంలో ఆ ఫొటోకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్ గా ఉండటమే అందుకు ప్రధాన కారణం.
అయితే దీనిపై నెహ్రా స్పందిస్తూ.. ' సోషల్ మీడియాకి నేను చాలా దూరం. ఆనాటి విరాట్ తో దిగిన ఫొటో ఇప్పుడు వైరల్ గా మారిందని తెలుసుకున్నా. విరాట్ గొప్పస్థాయికి చేరుకున్నాడు కాబట్టే ఆ ఫొటోకు అంత విలువ. అందుకే దాని గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఒకవేళ విరాట్ ఈ స్థాయికి చేరకపోయి ఉంటే.. అది సాధారణ ఫొటో మాదిరిగా ఏ గోడకో పరిమితమయ్యేది. దాన్ని పట్టించుకునేవారే ఉండేవారు కాదు. నేను వీడ్కోలు చెప్పిన తరుణంలో ఆ ఫొటో బయటకు రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఆ ఫొటో ఘనత విరాట్ కోహ్లికే దక్కాలి'అని నెహ్రా పేర్కొన్నాడు. 2003లో భారత జట్టు వరల్డ్ కప్ ఆడుతున్న సమయంలో కోహ్లికి నెహ్రా ఒక బహుమతిని అందజేశాడు. అప్పుడు స్కూల్ స్థాయి క్రికెట్ ఆడుతున్న కోహ్లి.. ఇప్పుడు క్రికెట్ ను శాసించే స్థాయికి చేరుకోవడంతో ఆ ఫొటో వైరల్ గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment