యాష్లే బార్టీ
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేత వరల్డ్ నెం.1 యాష్లే బార్టీ హవా కొనసాగుతోంది. గురువారం 55 నిమిషాల పాటు సాగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో బార్టీ 6–1, 6–3తో వాన్‌వ్యుట్‌వాన్క్(బెల్జియం)పై గెలుపొంది మూడో రౌండ్ చేరింది. మ్యాచ్‌లో బార్టీ ఐదు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. మరోవైపు మాజీ చాంపియన్, అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ 2–6, 6–2, 6–4తో జువాన్ (స్లొవేనియా)పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–0, 6–2తో యాంగ్ (చైనా)పై, 6వ సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–2తో క్రిస్టీనా మ్లడినోవిచ్ (ఫ్రాన్స్)పై, జొహానా కొంటా (బ్రిటన్) 6–3, 6–4తో కేథరినా సినికోవాపై గెలుపొందారు. అమెరికా టీనేజ్ సంచలనం కోరీ గాఫ్ 6–3, 6–3తో 2017 సెమీఫైనలిస్ట్ రిబరికోవా (స్లొవేకియా)పై నెగ్గి మూడో రౌండ్ చేరుకుంది.
జొకో జోరు..
పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) తన జోరు కొనసాగిస్తున్నాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో అతడు 6–3, 6–2, 6–2తో కుడ్లా (అమెరికా)పై గెలిచి మూడో రౌండ్ చేరుకున్నాడు. జొకోతో పాటు రెండో సీడ్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సైతం తన సొగసైన గ్రాస్ కోర్టు ఆటతో ప్రేక్షకులకు కనువిందు చేస్తు్తన్నాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్ 6–1, 7–6 (7/3), 6–2తో జే క్లార్క్ (బ్రిటన్)పై గెలిచి తదుపరి రౌండ్‌లో అడుగుపెట్టాడు. మ్యాచ్‌లో ఫెడరర్ 46 విన్నర్లు, 10 ఏస్‌లు సంధించాడు. 8వ సీడ్ కీ నిషికోరి (జపాన్) 6–4, 6–4, 6–0తో కెమరాన్ నొర్రీపై గెలిచి మూడో రౌండ్‌లో ప్రవేశించాడు. పోర్చుగల్‌కు చెందిన జొనో సౌసా 6–4, 6–4, 6–4 తేడాతో వరుస సెట్లలో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)ను ఓడించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు నికీ కిరియోస్‌తో మ్యాచ్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ 6–3, 3–6, 7–6 (7/5),7–6(7/3)తో చెమటోడ్చి నెగ్గాడు. తొలి సెట్‌ను సునాయాసంగా గెల్చుకున్న నాదల్‌ను రెండో సెట్‌లో కిరియోస్ ప్రతిఘటించాడు. అయితే మూడో, నాలుగో సెట్‌లను టై బ్రేక్‌లో వశం చేసుకున్న నాదల్ జయభేరి మోగించాడు.
బోపన్న జోడీకి చుక్కెదురు..
వింబుల్డన్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత డబుల్స్ ప్లేయర్ రోహన్ బోపన్న–పాబ్లో క్యువాస్(ఉరుగ్వే) జోడీకి మొదటి రౌండ్‌లోనే చుక్కెదురైంది. వీస్లీ కూలోఫ్ (నెదర్లాండ్)–మార్కస్ డేనియల్(న్యూజిలాండ్)లతో జరిగిన మ్యాచ్‌లో బోపన్న ద్వయం 4–6, 4–6, 6–4, 6–7(7/9) తేడాతో ఓటమి పాలైంది. మొదటి రెండు సెట్లను ప్రత్యర్థులకు సులువుగా సమర్పించుకున్న బోపన్న జంట మూడో సెట్‌ను గెలిచింది. అయితే నాలుగో సెట్‌ను టై బ్రేక్‌లో కోల్పోయిన ఈ జోడీ... మ్యాచ్‌ను సైతం చేజార్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment