శిక్షణ కోసం మరో దేశానికి వెళతాం!
‘బాయ్’ పట్టించుకోవడం లేదు
డబుల్స్ ద్వయం జ్వాల-అశ్విని వ్యాఖ్య
బెంగళూరు: కెరీర్‌లో ఎన్ని విజయాలు సాధించినా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) తమను పట్టించుకోవడం లేదని డబుల్స్ స్టార్లు జ్వాల-అశ్విని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే శిక్షణ కోసం తాము మరో ఆసియా దేశాన్ని వెతుక్కుంటున్నామని చెప్పారు. తమకు ఇప్పటి వరకు ప్రత్యేకమైన డబుల్స్ కోచ్ లేడని అశ్విని వాపోయింది.
‘ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే వచ్చే ఏడాది మాకు అత్యంత కీలకం. నేను ఎక్కువగా బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తే జ్వాల హైదరాబాద్‌లో కొనసాగిస్తోంది. కోర్టులో మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది. అయితే ఇదొక్కటే సరిపోదు. మంచి ప్రోత్సాహం అందించే వారు కావాలి’ అని అశ్విని పేర్కొంది.
మరో ఆసియా దేశంలో శిక్షణ కోసం చర్చలు జరుపుతున్నామని జ్వాల తెలిపింది. ప్రాక్టీస్ కోసం మంచి వాతావరణం కోరుకుంటున్న తాము ఇక నుంచి బాయ్‌పై ఎక్కువగా ఆధారపడబోమని స్పష్టం చేసింది. ఈ విషయంలో వేచి చూడాల్సిన అవసరం కూడా లేదంది. డబుల్స్‌కు ప్రత్యేకమైన కోచ్ కావాలని చాలాసార్లు మొరపెట్టుకున్నా బాయ్ తిరస్కరించిందని విమర్శించింది. గత కొన్నేళ్లుగా ప్రపంచ స్థాయిలో తమ ప్రదర్శనను చూసిన తర్వాతైనా... మహిళా షట్లర్లపై బాయ్ తమ దృక్పథాన్ని మార్చుకోవాలని సూచించింది.
2010 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని ఈ జోడీ ధ్వజమెత్తింది. ప్రస్తుతం టాప్ ప్లేయర్లందరూ హైదరాబాద్ క్యాంప్‌లో శిక్షణ తీసుకుంటుంటే తమను రెబెల్స్‌గా భావించి బెంగళూరుకు పంపించారన్నారు. ఇక్కడ కోచ్‌గానీ, ఫిజియోగానీ లేరన్నారు. మరోవైపు బెంగళూరు క్యాంప్‌లో ఒకే కోచ్ ఉన్నారని, మరో ఇద్దరితో పాటు ఒక సహాయక సిబ్బంది రావాల్సి ఉందని బాయ్ వర్గాలు తెలిపాయి.