ఆ ఇద్దరికి.. గోపిచంద్ సలహా
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వంతో పాటు బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)నుంచి కూడా గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలకు తగిన సహకారం అందుతోందని, వివాదాలు మాని ఆటపై దృష్టి పెడితే మంచిదని భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయ పడ్డారు. ఇకనైనా విమర్శలు కట్టి పెట్టాలని ఆయన సూచించారు. 'మాకు మద్దతు ఇవ్వడం లేదని వారిద్దరూ తరచుగా అంటున్నారు. ఎలాంటి ఆధారం లేకుండా వ్యాఖ్యలు చేయడంలో అర్థం లేదు. వారి సమస్య ఏమిటో సరిగ్గా, కచ్చితంగా చెబితే దానిపై ఆలోచించవచ్చు.
ఇది పునరావృతం కావడం దురదృష్టకరం. నాకు తెలిసి దీనికి ముగింపు పలికి మన శ్రమను ఆటలో ఎదిగేందుకు వాడాల్సిన అవసరం ఉంది' అని గోపీచంద్ వ్యాఖ్యానించారు. జ్వాల, అశ్విని ఆడే అన్ని టోర్నీలకు ‘సాయ్’, ‘బాయ్’ అండగా నిలిచాయని, డబుల్స్ స్పెషలిస్ట్ కోచ్‌లతో శిక్షణ ఇప్పించామన్న గోపీచంద్... గత కొన్నేళ్లలో వారు ఏది అడిగినా అందుబాటులో ఉంచామని గుర్తు చేశారు.