గోపీచంద్‌ను ఎందుకు ప్రశ్నించరు: జ్వాల | Gutta Jwala Slams Pullela Gopichand For Include Padukone In Book | Sakshi
Sakshi News home page

గోపీచంద్‌ను ఎందుకు ప్రశ్నించరు: జ్వాల

Published Tue, Jan 14 2020 6:22 PM | Last Updated on Tue, Jan 14 2020 6:54 PM

Gutta Jwala Slams Pullela Gopichand For Include Padukone In Book - Sakshi

న్యూఢిల్లీ: భారత బ్యా‍డ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌పై బ్యాడ్మింటన్‌ ఫైర్‌ బ్రాండ్‌ గుత్తా జ్వాల మరోసారి ఘాటు విమర్శలు చేశారు. గతంలో దిగ్గజ బ్యాడ్మింటన్‌ సూపర్‌స్టార్‌ ప్రకాశ్‌ పదుకొనే వద్దకు శిక్షణ తీసుకోవడానికి వెళ్లిన వ్యక్తి, ఇప్పుడు అతన్నే తప్పుబడుతున్నాడంటూ మండిపడ్డారు. గోపీచంద్‌పై ‘డ్రీమ్స్‌ ఆప్‌ ఎ బిలియన్‌, ఇండియా అండ్‌ ద ఒలింపిక్‌ గేమ్స్‌’ అనే పుస్తకం వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సైనా నెహ్వాల్‌తో గతంలో వచ్చిన మనస్పర్థలను వివరించాడు. తన అకాడమీ నుంచి సైనా వెళ్లిపోవడం ఇష్టంలేదని చెప్పినప్పటికీ తన మాట వినిపించుకోలేదని తెలిపాడు.

ఈ విషయంలో ఒలింపిక్స్‌ గోల్డ్‌క్వెస్ట్‌ (ఓజీక్యూ) సభ్యులైన ప్రకాశ్‌ పదుకొనే, విమల్‌ కుమార్, వీరేన్‌ రస్కినా సైనాను హైదరాబాద్‌ వీడేందుకు ప్రోత్సహించారని విమర్శించాడు. అంతేకాక ప్రకాశ్‌ పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పడానికి సానుకూల విషయమంటూ ఏదీ లేదని వ్యాఖ్యానించాడు. దీనిపై గుత్తా జ్వాల స్పందిస్తూ ‘ఇక్కడ ఏడుస్తున్న వ్యక్తి.. ప్రకాశ్‌ సర్‌ దగ్గర శిక్షణ తీసుకోడానికి హైదరాబాద్‌ను వదిలి వెళ్లాడు. మరి దీన్ని ఎందుకు ఎవరూ ప్రశ్నించట్లేదు’ అని ట్వీట్‌ చేశారు.

ఈ వివాదంపై ప్రకాశ్‌ పదుకొనే బ్యాడ్మింటన్‌ అకాడమీ స్పందిస్తూ.. రియో ఒలింపిక్స్‌లో భాగంగా సైనాను హైదరాబాద్‌లోని పుల్లెల అకాడమీ నుంచి బెంగళూరుకు తరలించడంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని వెల్లడించింది. కాగా 2014 ప్రపంచ చాంపియన్‌షిప్‌ తర్వాత సైనా నెహ్వాల్‌ హైదరాబాద్‌లోని గోపీచంద్‌ అకాడమీని వీడి బెంగళూరులో ప్రకాశ్‌ పదుకొనే అకాడమీలో చేరింది. అక్కడే రెండేళ్లపాటు కోచ్‌ విమల్‌ కుమార్‌ వద్ద శిక్షణ తీసుకున్న సైనా.. ఆపై మళ్లీ తిరిగి గోపీచంద్‌ అకాడమీకి చేరింది. ఇక కోచ్‌ గోపీచంద్‌ కూడా ప్రకాశ్‌ పదుకొనే దగ్గర శిక్షణ తీసుకున్నవాడే కావడం గమనార్హం.

చదవండి: వెళ్లొద్దన్నా... వెళ్లిపోయింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement