కోల్‌కతా: సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్ వేదిక మారింది. టోర్నీ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉండగా...పాక్‌లో ఆడలేమంటూ బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో మార్పు అనివార్యమైంది. ఈ టోర్నీ యూఏఈలోని దుబాయ్‌లో జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వెల్లడించాడు. భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఇరు జట్ల మధ్య 2012–13 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రం తలపడుతున్నాయి. దుబాయ్‌లో వచ్చే నెల 3న జరిగే ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) సమావేశంలో పాల్గొనేందుకు గంగూలీ అక్కడికి వెళ్లనున్నాడు. ఈ సందర్భంగా ఈడెన్ గార్డెన్స్‌లో మీడియాతో మాట్లాడుతూ... ఆసియా టోర్నీలో దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ తలపడతాయని అన్నాడు. ఆసీస్ ఆతిథ్యమిస్తున్న మహిళల టి20 ప్రపంచకప్‌లో అమ్మాయిల జట్టు అద్భుతంగా రాణిస్తోందని అతను కితాబిచ్చాడు. న్యూజిలాండ్ పర్యటనలో టెస్టు సిరీస్‌లో వెనుకబడిన విరాట్ సేన రెండో టెస్టులో పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment