కదనరంగంలోనే కాదు దేశం కోసం క్రీడాంగణంలోనూ తమ సత్తా చాటుతామని భారత సైనికులు నిరూపించారు. ఆసియా క్రీడల్లో భాగంగా రోయింగ్ క్రీడాంశం చివరి రోజు మన క్రీడాకారులు స్వర్ణం, రెండు కాంస్యాలతో తమ పోరాటానికి చిరస్మరణీయ ముగింపు ఇచ్చారు. గురువారం నాలుగు ఈవెంట్స్‌లో ఫైనల్‌కు చేరినా ఒక్క పతకం కూడా గెలవలేకపోయిన బాధను మరచి... శుక్రవారం వీరోచిత ప్రదర్శనతో అందరి మన్ననలు పొందారు. సవర్ణ్ సింగ్, దత్తు బబన్ భోకనాల్, ఓంప్రకాశ్, సుఖ్‌మీత్ సింగ్‌లతో కూడిన బృందం పురుషుల క్వాడ్రాపుల్ స్కల్స్‌లో పసిడి పతకం దక్కించుకుంది. రోహిత్ కుమార్, భగవాన్ సింగ్‌లతో కూడిన జోడీ పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్‌లో కాంస్యం... దుష్యంత్ చౌహాన్ పురుషుల లైట్ వెయిట్ సింగిల్ స్కల్స్‌లో కాంస్యం సాధించాడు. రోయింగ్‌తోపాటు టెన్నిస్, షూటింగ్‌లోనూ రాణించి పోటీల ఆరో రోజును భారత్ రెండు స్వర్ణాలు, రజతం, 4 కాంస్యాలతో ముగించింది.
పాలెంబాంగ్: ఒకరోజు ముందు పతకాలు గెలవాల్సిన చోట తడబడ్డామనే బాధ ఒకవైపు వేటాడుతుండగా... దేశానికి పతకాలతో తిరిగి వెళ్లాలనే చివరి అవకాశం కళ్ల ముందు కదలాడుతుండగా... భారత రోయర్లు అద్భుతం చేశారు. తమ శక్తినంతా కూడదీసుకొని స్వర్ణం, రెండు కాంస్యాలు సాధించి మూడు పతకాలతో స్వదేశానికి సగర్వంగా తిరిగి రానున్నారు. ఆసియా క్రీడల్లో భాగంగా రోయింగ్ క్రీడాంశం చివరి రోజు శుక్రవారం భారత్ మూడు పతకాలతో మెరిపించింది. ముందుగా లైట్ వెయిట్ సింగిల్ స్కల్స్ ఈవెంట్‌లో దుష్యంత్ చౌహాన్ కాంస్య పతకంతో ఖాతా తెరిచాడు. రెండు కిలోమీటర్ల లక్ష్యాన్ని దుష్యంత్ 7 నిమిషాల 18.76 సెకన్లలో చేరి మూడో స్థానాన్ని పొందాడు. హ్యున్‌సు పార్క్ (కొరియా; 7ని:12.86 సెకన్లు) స్వర్ణం... చున్ చియు హిన్ (హాంకాంగ్; 7ని:14.16 సెకన్లు) రజతం గెలిచారు. 2014 ఇంచియోన్ క్రీడల్లోనూ ఇదే విభాగంలో దుష్యంత్‌కు కాంస్యం లభించింది.
కాంస్యంతో ఖాతా తెరిచిన ఉత్సాహంతో క్వాడ్రాపుల్ స్కల్స్ ఫైనల్ రేసుకు సిద్ధమైన భారత బృందం అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రెండు కిలోమీటర్ల లక్ష్యాన్ని సవర్ణ్ సింగ్, దత్తు బబన్ భోకనాల్, ఓంప్రకాశ్, సుఖ్‌మీత్ సింగ్‌లతో కూడిన బృందం 6 నిమిషాల 17.13 సెకన్లలో అందరికంటే ముందుగా చేరుకొని పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సింగిల్ స్కల్స్‌లో కాంస్యం నెగ్గిన సవర్ణ్ ఆ తర్వాత గాయంతో దూరమయ్యాడు. గతేడాది పునరాగమనం చేసిన అతను ఈసారి స్వర్ణాన్ని మెడలో వేసుకున్నాడు. ‘నేను పునరాగమనం చేస్తానని...దేశం కోసం మళ్లీ పతకం గెలుస్తానని అస్సలు అనుకోలేదు. నా వెన్నునొప్పి చికిత్సకు భారత రోయింగ్ సమాఖ్య ఖర్చులు భరించింది. మళ్లీ బరిలో దిగేందుకు చీఫ్ కోచ్ ఇస్మాయిల్ బేగ్ కూడా ఎంతో ప్రోత్సహించారు’ అని సవర్ణ్ సింగ్ అన్నాడు. కాంస్యం, స్వర్ణం లభించాక లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్ ఫైనల్లో భగవాన్ సింగ్, రోహిత్ కుమార్‌లతో కూడిన జోడీ భారత్ ఖాతాలో మూడో పతకాన్ని జమచేసింది. రెండు కిలోమీటర్ల లక్ష్యాన్ని భగవాన్, రోహిత్ ద్వయం 7 నిమిషాల 04.61 సెకన్లలో ముగించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. మహిళల విభాగంలో మాత్రం భారత్‌కు నిరాశ ఎదురైంది. సంయుక్త డుంగ్‌డుంగ్, అన్ను, నవనీత్ కౌర్, యామిని సింగ్‌లతో కూడిన భారత బృందం ఉమెన్స్ ఫోర్ ఫైనల్లో చివరిదైన ఆరో స్థానంలో నిలిచింది.
రోయింగ్ కోచ్‌పై వేటు?
ఏషియాడ్ రోయింగ్‌లో పతకాల లక్ష్య సాధనలో విఫలమైనందుకు విదేశీ కోచ్ నికోలాయ్ జియోగాపై వేటుపడనున్నట్లు తెలుస్తోంది. భారత బృందం ప్రదర్శనపై రోయింగ్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి గిరీష్ ఫడ్నిస్... త్వరలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఇందుకు బలాన్నిస్తోంది. ఈ సందర్భంగా రొమేనియాకు చెందిన జియోగా... శిక్షణపై ప్రశ్నించనున్నట్లు సమాచారం. అతడి పద్ధతుల కారణంగా భారత రోయర్లు అస్వస్థతకు గురవడంతో పతకాల సాధనలో వెనుకడినట్లు సమాఖ్య అధికారులు భావిస్తున్నారు. దీంతో జియోగాను సాగనంపడం ఖాయంగా కనిపిస్తోంది.
►ఆసియా క్రీడల చరిత్రలో రోయింగ్‌లో భారత్‌కు లభించిన స్వర్ణాల సంఖ్య. 2010లో బజరంగ్ లాల్ ఠక్కర్ సింగిల్ స్కల్స్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం సాధించాడు.
►ఢిల్లీ ఏషియాడ్ (1982)లో రోయింగ్‌ను తొలిసారి ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భారత రోయర్లు 2 స్వర్ణాలు, 5 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment