హైదరాబాద్:ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు దాదాపు నెల రోజుల పాటు భారత్ లో పర్యటించడంపై ఆ దేశ సెలక్టర్, మాజీ కెప్టెన్ మార్క్ వా విచారం వ్యక్తం చేశాడు. ఇంత సుదీర్ఘమైన సమయం ఆసీస్ జట్టు భారత్ లో పర్యటించడం సరైనది కాదంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మేరకు ముందుగా ఖరారు చేసిన ఆసీస్-భారత్ ల షెడ్యూల్ కూడా ఎంతమాత్రం శ్రేష్టం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. స్వదేశంలో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ను దృష్టిలో పెట్టుకుని ఆసీస్ క్రికెటర్లు ఇన్ని రోజుల పాటు వేరే చోట క్రికెట్ ఆడటం వారికి తగినంత బ్రేక్ దొరకదన్నాడు.
'ఇదొక సుదీర్ఘమైన సిరీస్. వారం ముందుగా కానీ, రెండు వారాల ముందు కానీ ఈ షెడ్యూల్ ముగిసి పోతే బాగుండేది. భారత్ లో పరిమిత ఓవర్ల సిరీస్ లో ఎనిమిది మ్యాచ్ లకు గాను ఎనిమిది వేర్వేరు ప్లేస్ ల్లో ఆటగాళ్లు పర్యటించడం జరిగింది. ఇప్పుడు క్రికెటర్లు స్వదేశానికి వెళ్లిన తరువాత వారికి సరైన విశ్రాంతి లభించదు. కొద్దిపాటి బ్రేక్ తోనే రెడ్ బాల్ క్రికెట్ కు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అది కూడా యాషెస్ లాంటి ఓ ప్రతిష్టాత్మక సిరీస్ కు సిద్దం కావాలి. మా క్రికెటర్లు సాధ్యమైనంత తొందరగా యాషెస్ ను అందిపుచ్చుంటారని అనుకుంటున్నా' అని ప్రస్తుతం తమ జట్టుతో పాటు భారత్ లో ఉన్న మార్క్ వా పేర్కొన్నాడు. సెప్టెంబర్ 17వ తేదీన తొలి వన్డేతో ఆరంభమైన సిరీస్ అక్టోబర్ 13న హైదరాబాద్ లో జరిగే టీ 20తో ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment