టైటిల్ పోరులో భారత్ తడబాటు
అజ్లాన్ షా కప్‌లో రజతంతో సరి ఆస్ట్రేలియాదే స్వర్ణం
ఇపో (మలేసియా): ఆరోసారి అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత్‌కు నిరాశ ఎదురైంది. ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో శని వారం జరిగిన ఫైనల్లో టీమిండియా 0-4 గోల్స్ తేడాతో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఆసీస్ తరఫున థామస్ విలియమ్ క్రెయిగ్ (25వ, 35వ నిమిషాల్లో), మాట్ గోడెస్ (43వ, 57వ నిమిషాల్లో) రెండేసి గోల్స్ సాధించారు.
33 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో ఐదుసార్లు విజేతగా నిలిచిన భారత్, రెండుసార్లు మాత్రమే రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2008లో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఓడిన భారత్, ఈ ఏడాది మరోసారి టైటిల్ పోరులో తడబడింది. తాజా ఫలితంతో ఆస్ట్రేలియా ఈ టైటిల్‌ను తమ ఖాతాలో తొమ్మిదోసారి వేసుకుంది. గతంలో ఆస్ట్రేలియా (1983, 93, 2004, 05, 07, 2011, 13, 14) ఎనిమిదిసార్లు ఈ టైటిల్‌ను దక్కించుకుంది.
లీగ్ దశలో ఆసీస్ చేతిలో 1-5తో ఓడిన భారత్ ఫైనల్లో మాత్రం కాస్త పోరాటపటిమ కనబరిచింది. తొలి 25 నిమిషాల వరకు ఆసీస్‌ను గోల్ చేయనీకుండా నిలువరించింది. అయితే రక్షణ పంక్తిలో సమన్వయ లోపాలు, ఆసీస్ ఆటగాళ్ల చురుకైన కదలికలతో ఆ తర్వాత మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది. భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్‌లు దక్కినా ఫలితం లేకపోయింది. ఆసీస్ చేసిన నాలుగు గోల్స్ ఫీల్డ్ గోల్స్ కావడం విశేషం. ఆసీస్ జట్టు తమకు లభించిన మూడు పెనాల్టీ కార్నర్‌లను వృథా చేసుకుంది.