'విరాట్ కోహ్లినే లక్ష్యంగా'
కోల్ కతా: త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందంటున్న మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ.. ఇది కచ్చితంగా విరాట్ కోహ్లి కెప్టెన్సీకి పరీక్ష అని అభిప్రాయపడ్డాడు. ఆసీస్ తో స్వదేశంలో జరిగే ఈ సిరీస్ విరాట్ భవిష్యత్తను మార్చే సిరీస్ గా గంగూలీ అభివర్ణించాడు. పుణెలో 23వ తేదీన ఆరంభమయ్యే తొలి టెస్టు నుంచే విరాట్ కోహ్లి టార్గెట్ గా ఆసీస్ ప్రణాళికలు సిద్దం చేయడం ఖాయమన్నాడు.
'గత ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ ను ఆసీస్ టార్గెట్ చేసినట్లే, ఈ సిరీస్ లో కూడా అతనే లక్ష్యంగా ఆ జట్టు ఛాలెంజ్ కు సిద్ధమవడం ఖాయం. ఈ సిరీస్ విరాట్ లైఫ్ ఛేంజిగ్ సిరీస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. విరాట్ అసాధారణ ఆటగాడిగా రూపాంతరం చెందిన నాటి నుంచి చూస్తే ఇది అతనికి కఠినమైన సిరీస్. తొలి టెస్టు నుంచి ఆసీస్ దూకుడును ప్రదర్శించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా విరాట్ కోహ్లినే టార్గెట్ చేస్తూ వారు చెలరేగిపోయే అవకాశం ఉంది. ఆసీస్ కూడా బలమైన జట్ట్టే కావడంతో రసవత్తర పోరు ఖాయం. కాకపోతే భారత్ పై ఆసీస్ విజయం సాధించడం మాత్రం అంత ఈజీ కాదు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లు చాలా చాలా బాగా ఆడితేనే భారత్ కు పోటీ ఇచ్చే అవకాశం ఉంది 'అని గంగూలీ పేర్కొన్నాడు.