న్యూఢిల్లీ: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్ ప్రయోగం ముందుకు సాగేలా కనిపించడం లేదు. ఇప్పడున్న కఠిన పరిస్థితుల్లో బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో అదనంగా మరో టెస్టు మ్యాచ్‌ను ఆడించడం చాలా కష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భాగంగా కోహ్లి సేన ఈ నవంబర్‌లో ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడాల్సి ఉంది. అయితే దీన్ని ఐదు మ్యాచ్‌ల సిరీస్‌గా నిర్వహించాలని సీఏ సీఈవో కెవిన్ రాబర్ట్స్ ఆశించాడు. భారత్‌తో తమకున్న పటిష్ట అనుబంధం దృష్ట్యా ఇది జరిగే అవకాశముందన్న రాబర్ట్స్... కచ్చితంగా జరుగుతుందన్న హామీ మాత్రం ఇవ్వలేనన్నాడు. దీనిపై స్పందించిన గంగూలీ ‘ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడటం సాధ్యం అవుతుందని నేను భావించట్లేదు. టెస్టులతో పాటు భారత్ వన్డేలు కూడా ఆడాల్సి ఉంది. పైగా 14 రోజుల క్వారంటైన్ నిబంధనలు పాటించాలి. దీంతో పర్యటన సుదీర్ఘంగా మారుతుంది’ అని వివరించాడు.
‘దాదా’ ఐసీసీని పాలించగలడు: డేవిడ్ గోవర్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని పాలించే సరైన నాయకత్వ లక్షణాలు గంగూలీకి ఉన్నాయని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ కితాబిచ్చాడు. ఐసీసీ కన్నా బీసీసీఐ అధ్యక్షునిగా రాణించడమే కఠినమైనదని అన్నాడు. ‘బీసీసీఐని నడిపించాలంటే ఎంతో సమర్థత ఉండాలి. పరపతితోపాటు రాజకీయాలతో తెలివిగా వ్యవహరించాలి. సవాలక్ష సవాళ్లను ఎదుర్కోవాలి. వీటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటున్న గంగూలీ ఏదో ఒక రోజు ఐసీసీని నడిపించగలడు. నిజం చెప్పాలంటే ఐసీసీ కన్నా బీసీసీఐని పాలించడమే కష్టం’ అని డేవిడ్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment