ఆసీస్ కు అంత ఈజీ కాదు..
కోల్ కతా: నాలుగు టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియా నుంచి భారత్ కు గట్టి పోటీ లభిస్తుందని తాను అనుకోవడం లేదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ పుణెలో జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ కు ఎదురుదెబ్బ తగిలితే, ఇక వారు సిరీస్ను కాపాడుకోవడం కష్టమని గంగూలీ తెలిపాడు. పుణె పిచ్ క్రమేపీ స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఆసీస్ ఎంతవరకూ నిలబడుతుందనేది ఆ జట్టుకు ఛాలెంజ్ అన్నాడు. ఈ సిరీస్ లో ఆసీస్ కు వైట్ వాష్ తప్పకపోవచ్చని గంగూలీ మరొకసారి పేర్కొన్నాడు.
'ఆస్ట్రేలియా జట్టును ఎప్పుడూ గౌరవిస్తాం. ఆ జట్టు కొన్ని సంవత్సరాల నుంచి వారు చాంపియన్ తరహాలో టెస్టు క్రికెట్ ఆడుతోంది. గత 30-40ఏళ్లలో నేను చూసిన అత్యుత్తమ జట్లలో ఆసీస్ ఒకటి. కానీ ఇక్కడ స్పిన్ ట్రాక్ పై భారత్ ను ఆసీస్ ఎలా అడ్డుకుంటుందనేదే ప్రధాన ప్రశ్న. విరాట్ సేనను స్వదేశంలో ఓడించడం ఆసీస్ కు అంత ఈజీ కాదు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాగా ఇక్కడ స్పిన్ ను సమర్ధవంతంగా ఎదుర్కోగలిగే ఒకే ఒక్క ఆటగాడు. స్మిత్ కు స్పిన్ పై మంచి అవగాహన ఉంది.
భారత్ కు స్మిత్ నుంచే గట్టి పోటీ ఉండవచ్చు. ఈ స్పిన్ పిచ్ లపై డేవిడ్ వార్నర్ భారీ స్కోర్లు చేస్తాడని అనుకోవడం లేదు. నిజాయితీగా చెప్పాలంటే ఐపీఎల్ పిచ్లకు ఈ టెస్టు పిచ్లకు చాలా తేడా ఉంది. ఐపీఎల్ పిచ్ ఫ్లాట్గా ఉండటంతో పాటు గ్రౌండ్లు చిన్నవిగా ఉంటాయి. దాంతో మంచి స్కోర్లు చేసే అవకాశం ఉంటుంది. ఇదొక టెస్టు సిరీస్. ఇక్కడ పిచ్ లు,బంతులు అన్ని కూడా భిన్నంగా ఉంటాయి. ఆ క్రమంలో అశ్విన్, జడేజాల స్పిన్ ను వార్నర్ ఎదుర్కోగలడని నేను కచ్చితంగా చెప్పలేను' అని గంగూలీ పేర్కొన్నాడు.