భారత మహిళలకు మరో ఓటమి
హోబార్ట్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన రెండో వన్డేలోనూ భారత మహిళలకు పరాజయం తప్పలేదు. భారత్ విసిరిన 253 పరుగుల లక్ష్యాన్ని 46.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా ఛేదించింది. దీంతో సిరీస్ ను ఆస్ట్ట్రేలియా 2-0 తేడాతో గెలుచుకుంది. శుక్రవారం జరిగిన వన్డేలో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ తీసుకుని నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. భారత మహిళల్లో స్మృతీ మంధన(102) సెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ మిథాలీ రాజ్(58) బాధ్యతాయుతంగా ఆడింది. అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్ (21),శిఖా పాండే(33) ఫర్వాలేదనిపించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది.
ఆపై ఆస్ట్రేలియా దాటిగా బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు బోల్టాన్(77), లానింగ్(61) రాణించి తొలి వికెట్ కు 138 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తరువాత పెర్రీ(31), బ్లాక్ వెల్(19), జోనాసెన్(29 నాటౌట్),హీలై(29 నాటౌట్) లు మిగతా పనిని పూర్తి చేయడంతో ఆసీస్ ఇంకా ఆరు వికెట్లు చేతిలో ఉండగానే లక్ష్యాన్ని చేరుకుని సిరీస్ ను చేజిక్కించుకుంది. చివరిదైన మూడో వన్డే ఫిబ్రవరి 7వ తేదీన ఇదే స్టేడియంలో జరుగనుంది.