జాసన్ రాయ్ వికెట్ తీసిన ఆనందంలో ఆసీస్ ఆటగాళ్లు
సాక్షి, స్పోర్ట్స్: అడిలైడ్‌లో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ 44.5 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 8 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లింది. వన్డేల్లో మరో అత్యల్ప స్కోరు నమోదవుతుందా అని అనిపించింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆల్‌రౌండర్ మహ్మద్ అలీ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. జట్టు స్కోరు 61 పరుగుల వద్ద మోర్గాన్(33), 112 పరుగుల వద్ద అలీ అవుటయ్యారు.
మోర్గాన్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ బాధ్యతాయుతంగా ఆడటంతో ఆ మాత్రం స్కోరు చేయగలింది. జట్టు స్కోరు 180 పరుగుల వద్ద వోక్స్(78, నాలుగు ఫోర్లు, ఐదు సిక్స్‌లు) అవుటయ్యాడు. చివర్లో కుర్రాన్(35) రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్‌కు 4, హజల్‌వుడ్‌కు 3, ఆండ్రూ టైకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం స్వల్ప లక్ష్యంలోబ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు విజయం సాధించడానికి కష్ట పడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్లలో టిమ్ హెడ్(96), మిచెల్ మార్ష్(32), టిమ్ పెయిన్(25) రాణించారు. 37 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్‌కు 3 వికెట్లు దక్కాయి. బౌలింగ్‌లో 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించిన ప్యాట్ కమిన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మొదటి మూడు వన్డేలు ఇంగ్లాండ్ గెలిచిన విషయం తెల్సిందే. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య చివరిదైన ఐదవ వన్డే ఈ నెల 28న పెర్త్‌లో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment