సెంచరీతో కదం తొక్కిన మాక్స్‌వెల్
హోబర్ట్ : ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సెంచరీతో కదంతొక్కాడు. ట్రై సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో అటు బంతితో, ఇటు బ్యాట్‌తో రాణించి తన సత్తా నిరూపించుకున్నాడు. మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆసీస్‌ను మ్యాక్స్ వెల్ (103 , 58 బంతుల్లో, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) వేగవంతమైన సెంచరీ సాధించి గట్టెక్కించాడు.
దీంతో ఇంగ్లండ్ నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. హోబర్ట్‌లో వేదికగా జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌లలో మాలన్(50, 36 బంతుల్లో, 2 సిక్సర్లు, 5 ఫోర్లు) మినహా మిగతావారు చెప్పుకోదగిన పరుగులు చేయలేదు. ఆ సీస్ బౌలర్లలో మ్యాక్స్‌వెల్‌కు 3, అగర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్‌ను ఇంగ్లండ్ బౌలర్ డేవిడ్ విల్లీ మొదటి ఓవర్లోనే దెబ్బతీశాడు. డేవిడ్ వార్నర్(4) వికెట్ల వెనక దొరికిపోగా, క్రిస్ లిన్ డకౌట్ అయ్యాడు.
క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ ఏమాత్రం తడబడకుండా ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే తన కెరీర్‌లో రెండో టీ20 సెంచరీని నమోదు చేశాడు. బౌలింగ్‌లో 3 వికెట్లు, బ్యాటింగ్‌లో సెంచరీ చేసిన మాక్స్‌వెల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment