వార్నర్ వర్సెస్ డి కాక్..
డర్బన్: దక్షిణాఫ్రికా గడ్డపై తమ అద్భుత రికార్డును కొనసాగిస్తూ టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా 1–0తో ముందంజ వేసింది. సఫారీల చివరి వికెట్ తీసి విజయాన్ని ఖాయం చేసుకునేందుకు మ్యాచ్ ఆఖరి రోజు సోమవారం ఆసీస్‌కు 3.4 ఓవర్లు మాత్రమే సరిపోయాయి. రెండో ఇన్నింగ్స్‌లో 293/9 స్కోరుతో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో ఐదు పరుగులు జోడించి 298 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆస్ట్రేలియాకు 118 పరుగుల భారీ గెలుపు దక్కింది. చివరి బ్యాట్స్‌మన్ డి కాక్ (83)ను హాజల్‌వుడ్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేయడంతో కంగారూలు సంబరాల్లో మునిగిపోయారు. మ్యాచ్‌లో 9 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించిన మిచెల్ స్టార్క్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. రెండో టెస్టు శుక్రవారం నుంచి పోర్ట్ ఎలిజబెత్‌లో జరుగుతుంది.
వార్నర్ వర్సెస్ డి కాక్...
టెస్టు నాలుగో రోజు టీ విరామం సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న సమయంలో వార్నర్, డి కాక్ పరస్పరం దూషించుకోవడం కొత్త వివాదాన్ని రేపింది. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే దారిలో ఉన్న మెట్ల వద్దే వార్నర్ ఆవేశంగా డి కాక్ వైపు దూసుకుపోయే ప్రయత్నం చేయడం కెమెరాల్లో రికార్డయింది. సహచరుడు ఖాజా పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా వార్నర్ మాత్రం తగ్గలేదు. కొద్ది దూరంలోనే ఉన్న డి కాక్ కూడా ఆ సమయంలో ఏదో అంటూ తమ జట్టు గది వైపు వెళ్లిపోయాడు. మరోవైపు డివిలియర్స్‌ను రనౌట్ చేసిన అనంతరం అతని పక్కనే బాల్ విసిరేసి ‘అతి’గా వ్యవహరించిన స్పిన్నర్ లయన్‌పై మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా పడింది.
Comments
Please login to add a commentAdd a comment