
ఒకటా... రెండా... వరుసగా ఏడు టి20 మ్యాచ్‌ల్లో భారత్ చేతిలో పరాజయం రుచి చూసిన ఆస్ట్రేలియా ఎట్టకేలకు విజయఢంకా మోగించింది. తొలిసారిగా భారత బ్యాట్స్‌మెన్‌పై ఆసీస్ బౌలర్లు పైచేయి సాధించగా... బ్యాట్స్‌మెన్ కూడా నిలకడగా ఆడటంతో వార్నర్ బృందం ఖాతాలో విజయం చేరింది. పిచ్ నుంచి వచ్చిన సహకారాన్ని సొమ్ము చేసుకుంటూ బెహ్రెన్‌డార్ఫ్ వికెట్ల వేటకు టీమిండియా విలవిలలా డింది. కెరీర్‌లో రెండో టి20 ఆడిన పేసర్ బెహ్రెన్‌డార్ఫ్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డాడు. దాంతో భారత టాప్‌ఆర్డర్ 27 పరుగులకే పెవిలియన్ బాట పట్టింది. ఓ దశలో భారత్ కనీసం వంద పరు గులైనా దాటుతుందా అనిపించినా కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా ఆ అవమానాన్ని తప్పించారు. ఆ తర్వాత 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా చేధించి మూడు టి20ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. సిరీస్ విజేతను తేల్చే చివరిదైన మూడో టి20 మ్యాచ్ శుక్రవారం హైదరాబాద్‌లో జరుగుతుంది.
గువాహటి: సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తమ అద్భుత బౌలింగ్‌తో టీమిండియాకు షాక్ ఇచ్చింది. పేసర్ బెహ్రెన్‌డార్ఫ్ (4/21), లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా (2/19) సూపర్ షో కారణంగా... మంగళవారం జరిగిన రెండో టి20లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టి20ల సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. చివరిదైన మూడో టి20 హైదరాబాద్‌లో ఈనెల 13న జరుగుతుంది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. తొలి టి20లో ఆసీస్ కూడా ఇదే స్కోరు సాధించింది. కేదార్ జాదవ్ (27 బంతుల్లో 27; 1 సిక్స్, 3 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 25; 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆసీస్ 15.3 ఓవర్లలో రెండు వికెట్లకు 122 పరుగులు చేసి నెగ్గింది. హెన్రిక్స్ (46 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ చేయగా హెడ్ (34 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) సహకరించాడు. బుమ్రా, భువనేశ్వర్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. బెహ్రెన్‌డార్ఫ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది.
బెంబేలెత్తించిన బెహ్రెన్‌డార్ఫ్...
టాస్ నెగ్గిన వెంటనే వార్నర్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ వైపు ఎందుకు మొగ్గు చూపాడనేది తొలి ఓవర్‌లోనే అర్థమయ్యింది. పేసర్ బెహ్రెన్‌డార్ఫ్ మూడు బంతుల వ్యవధిలోనే రోహిత్ శర్మ (4 బంతుల్లో 8; 2 ఫోర్లు), విరాట్ కోహ్లి (0)లను పెవిలియన్‌కు పంపి గట్టి షాక్ ఇచ్చాడు. అంతకుముందు రోహిత్ తొలి, మూడో బంతిని ఫోర్లుగా మలిచినా ఫలితం లేకపోయింది. ఇక తన మరుసటి ఓవర్‌లో మనీశ్ పాండే (7 బంతుల్లో 6; 1 ఫోర్) పని పట్టగా.. కూల్టర్‌నీల్ ఓవర్‌లో కేదార్ జాదవ్ ఓవర్ మిడ్ వికెట్ మీదుగా అద్భుత సిక్సర్ బాది ఆకట్టుకున్నాడు. అటు బెహ్రెన్‌డార్ఫ్ తన మూడో ఓవర్‌లో ఈసారి శిఖర్ ధావన్ (6 బంతుల్లో 2)ను అవుట్ చేశాడు. ధావన్ ముందుకు వచ్చి భారీ షాట్ ఆడగా... మిడ్ ఆన్ నుంచి వెనక్కి పరిగెడుతూ వార్నర్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. దీంతో భారత్ 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జాదవ్, ధోని (16 బంతుల్లో 13; 1 ఫోర్) జోడి కొద్దిసేపు భారత్‌కు అండగా నిలిచింది. మరో వికెట్‌ను త్వరగా కోల్పోకుండా అడపాదడపా బౌండరీలతో స్కోరును గట్టెక్కించే ప్రయత్నం చేశారు. అయితే కుదురుకుంటున్నట్టు కనిపించిన ఈ ఇద్దరిని తన వరుస ఓవర్లలో ఆడమ్ జంపా పెవిలియన్‌కు చేర్చి భారత ఆశలపై నీళ్లు చల్లాడు. ముందుగా జంపా విసిరిన లెంగ్త్ బాల్‌ను డిఫెన్స్ ఆడబోయిన ధోని స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఐదో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తన మరుసటి ఓవర్ తొలి బంతికి వేసిన గూగ్లీ జాదవ్ బ్యాట్‌కు ప్యాడ్‌కు మధ్య నుంచి వెళ్లి వికెట్లను పడగొట్టింది. భువనేశ్వర్‌ను కూల్టర్‌నీల్ అవుట్ చేయడంతో భారత్ పూర్తి రక్షణాత్మకంగా ఆడింది. దీంతో పరుగులు రావడమే గగనమైంది. 33 బంతుల అనంతరం జట్టుకు ఫ్రీహిట్ ద్వారా ఓ బౌండరీ నమోదైంది. అయితే 17వ ఓవర్‌లో పాండ్యా భారీ సిక్స్‌తో ఒక్కసారిగా ఊపు తెచ్చాడు. అదే ఓవర్‌లో జట్టు స్కోరు 100 దాటింది. కానీ తర్వాతి ఓవర్‌లోనే పాండ్యా లాంగ్ ఆఫ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
చెలరేగిన హెన్రిక్స్
స్వల్ప లక్ష్యమే అయినా ఆసీస్ 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ప్రమాదకర ఓపెనర్లు వార్నర్ (2)ను బుమ్రా అవుట్ చేయగా... ఫించ్ (8)ను భువనేశ్వర్ దెబ్బ తీశాడు. వీరిద్దరి క్యాచ్‌లను కోహ్లి అందుకున్నాడు. కానీ ఈ సంతోషాన్ని ఆవిరి చేస్తూ హెన్రిక్స్, హెడ్ జోడి ధాటిగా బ్యాటింగ్‌ను కొనసాగించింది. ఎనిమిదో ఓవర్‌లో హెన్రిక్స్ ఓ సిక్స్, హెడ్ ఫోర్ సాధించడంతో 14 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఈ జోడి చెలరేగడంతో పరుగులు ధారాళంగా వచ్చాయి. ముఖ్యంగా స్పిన్నర్లు కుల్దీప్, చహల్‌ను లక్ష్యంగా వీరు బౌండరీలతో విరుచుకుపడ్డారు. కుల్దీప్ వేసిన 11వ ఓవర్‌లో చెరో ఫోర్ బాదగా ఆ తర్వాత చహల్ ఓవర్‌లో హెడ్... లాంగ్ ఆన్‌లో సిక్స్ కొట్టాడు. 13వ ఓవర్ (కుల్దీప్)లో హెన్రిక్స్ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి 42 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ఆ తర్వాత 16వ ఓవర్‌లో ఓ ఫోర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు.
►1 టి20ల్లో కోహ్లి డకౌట్ కావడం, ధోని స్టంప్ అవుట్ కావడం ఇదే తొలిసారి