సలామ్ సెరెనా | Australian Open 2017: Serena Williams beats Venus Williams to set Grand Slam record | Sakshi
Sakshi News home page

సలామ్ సెరెనా

Published Sun, Jan 29 2017 12:18 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

సలామ్ సెరెనా

సలామ్ సెరెనా

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన అమెరికా స్టార్‌
ఫైనల్లో సోదరి వీనస్‌పై విజయం
అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో రికార్డు
మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ హస్తగతం
రూ. 19 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం


నిరీక్షణ ముగిసింది. అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ మరో మైలురాయిని చేరుకుంది. ఓపెన్‌ శకంలో (1968 నుంచి) అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారిణిగా సెరెనా కొత్త చరిత్ర సృష్టించింది. 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో స్టెఫీ గ్రాఫ్‌ (జర్మనీ) పేరిట ఉన్న రికార్డును ఈ ‘నల్లకలువ’ బద్దలు కొట్టింది. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో తన అక్క వీనస్‌ విలియమ్స్‌పై సెరెనా గెలుపొంది ఏడోసారి ఈ టైటిల్‌ను సాధించింది. అదే క్రమంలో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.  

ఓపెన్‌ శకం అంటే....
1968 కంటే ముందు గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లలో కేవలం అమెచ్యూర్‌ ఆటగాళ్లు మాత్రమే ఆడేవారు. అయితే 1968 నుంచి ప్రొఫెషనల్‌ ఆటగాళ్లకు కూడా గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లలో ఆడే అవకాశం కల్పించారు. అప్పటి నుంచి ఓపెన్‌ శకం ప్రారంభమైంది.




జోర్డాన్‌ బహుమతి...

ఫైనల్‌ సందర్భంగా సెరెనాకు అరుదైన కానుక లభించింది. బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైకేల్‌ జోర్డాన్‌ 23 గ్రాండ్‌స్లామ్‌ టైటి ల్స్‌కు సూచికగా 23 అంకె ముద్రించిన షూస్‌ను సెరెనాకు పంపించారు. బహుమతి ప్రదానోత్సవంలో సెరెనా ఈ షూస్‌ ధరించింది.

మెల్‌బోర్న్‌: అదే జోరు. అదే ఫలితం. మరోసారి తన అక్క వీనస్‌ విలియమ్స్‌పై చెల్లెలు సెరెనా ఆధిపత్యం చలాయించింది. ఏడోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సెరెనా (అమెరికా) 6–4, 6–4తో 13వ సీడ్‌ వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా)ను ఓడించింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో వీనస్‌ తన సోదరికి గట్టి పోటీనే ఇచ్చినా కీలకదశలో సెరెనాయే పైచేయి సాధించింది. టైటిల్‌ గెలిచే క్రమంలో సెరెనా ఒక్క సెట్‌ కూడా తన ప్రత్యర్థులకు కోల్పోకపోవడం విశేషం. 2008లో మరియా షరపోవా (రష్యా) తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఒక్క సెట్‌ చేజార్చుకోకుండా నెగ్గిన క్రీడాకారిణి సెరెనాయే.

విజేతగా నిలిచిన సెరెనాకు 37 లక్షల ఆస్ట్రేలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 19 కోట్ల 3 లక్షల 68 వేలు)... రన్నరప్‌ వీనస్‌కు 18 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 9 కోట్ల 51 లక్షలు) లభించింది. ప్రస్తుతం రెండో ర్యాంక్‌లో ఉన్న సెరెనా ఈ విజయంతో సోమవారం విడుదల చేసే మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) తాజా ర్యాంకింగ్స్‌లో అధికారికంగా మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరుకుంటుంది. వీనస్, సెరెనాల మధ్య ఫైనల్‌ బ్రేక్‌ పాయింట్‌లతో మొదలైంది.

ఇద్దరూ తమ తొలి సర్వీస్‌లను కోల్పోవడంతో స్కోరు 1–1తో సమమైంది. ఆ తర్వాత ఏడో గేమ్‌లో వీనస్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన సెరెనా ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని తొలి సెట్‌ను 41 నిమిషాల్లో 6–4తో దక్కించుకుంది. బేస్‌లైన్‌ వద్ద ఆడుతూనే అడపాదడపా సెరెనా నెట్‌ వద్దకు దూసుకొచ్చి పాయింట్లు సాధించింది. మరోవైపు వీనస్‌ ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌లు లయ తప్పడంతోపాటు అనవసర తప్పిదాలు ఎక్కువ చేయడంతో సెరెనాకు అంతగా ఇబ్బంది ఎదురుకాలేదు. రెండో సెట్‌లో ఏడో గేమ్‌లో వీనస్‌ సర్వీస్‌లో బ్రేక్‌ సంపాదించిన సెరెనా తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది.

నీవు లేక నేను లేను...  
ఇది చాలా కఠినమైన మ్యాచ్‌. దేవుడి దయ వల్లే ఇక్కడున్నాను. వీనస్‌ వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆమె లేకుంటే నా 23 గ్రాండ్‌స్లామ్‌ విజయాలే లేవు. నేను నంబర్‌వన్‌గా ఉండేదాన్నే కాదు. ఆమె లేకుంటే అసలు నేనే లేను. ఆమె నాకు ప్రేరణగా నిలిచింది. మీ అందరి ముందు నేనిక్కడ ఉండడానికి కారణం కూడా ఆమే. నన్ను అత్యుత్తమ క్రీడాకారిణిగా తీర్చిదిద్దిన ఘనత వీనస్‌దే.     – సెరెనా

సెరెనా ‘గ్రాండ్‌’ టైటిల్స్‌... 23
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌    (7)    :    2003, 2005, 2007, 2009, 2010, 2015, 2017
ఫ్రెంచ్‌ ఓపెన్‌    (3)    :    2002, 2013, 2015
వింబుల్డన్‌    (7)    :    2002, 2003, 2009, 2010, 2012, 2015, 2016
యూఎస్‌ ఓపెన్‌    (6)    :    1999, 2002, 2008, 2012, 2013, 2014

నేటి షెడ్యూల్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌
ఫెడరర్‌ @ రాఫెల్‌ నాదల్‌
మధ్యాహ్నం గం. 2.00 నుంచి


మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌
సానియా మీర్జా, డోడిగ్‌@ స్పియర్స్, సెబాస్టియన్‌
ఉదయం గం. 10.30 నుంచి


సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement