
ఆఖర్లో.. ఆధిపత్యం
ఆఖరి ల్యాప్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ఆస్ట్రియన్ గ్రాండ్‌ప్రిలో.. మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు.
ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రి విజేత హామిల్టన్
స్పీల్‌బర్గ్: ఆఖరి ల్యాప్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ఆస్ట్రియన్ గ్రాండ్‌ప్రిలో.. మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన 71 ల్యాప్‌ల ప్రధాన రేసును అతను గంటా 27 నిమిషాల 38.107 సెకన్లలో ముగించి తొలిసారి ఈ టైటిల్ గెలిచాడు. మ్యాక్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్-1:27:43.826), రైకోనెన్ (ఫెరారీ-1:27:44.131) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పోల్ పొజిషన్‌తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్... ఆరంభంలో కాస్త వెనుకబడ్డాడు.
22 ల్యాప్‌ల తర్వాత కారును వ్యూహాత్మకంగా నడిపిస్తూ క్రమంగా ఆధిక్యంలోకి వచ్చాడు. 32వ ల్యాప్ నుంచి రోస్‌బెర్గ్ (మెర్సిడెజ్), హామిల్టన్ మధ్యనే పోటీ జరిగింది. అయితే చివరి ల్యాప్‌లో రోస్‌బెర్గ్ (1:27:54.817) కారును హామిల్టన్ ఢీకొట్టడంతో అతను నాలుగోస్థానానికి పరిమితమయ్యాడు. ఈ సంఘటనపై విచారణ జరుగుతుందని రేసు అనంతరం స్టీవార్డు ప్రకటించారు. రికియార్డో (రెడ్‌బుల్-1:28:09.088), బటన్ (మెక్‌లారెన్-1:28:15.813), గ్రోస్‌జీన్ (హాస్-1:28:22.775), సైంజ్ (టోరో రోసో-1:28:25.507) ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచారు.
‘ఫోర్స్’ వైఫల్యం: రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ కారు టైర్లతో ఇబ్బంది పడి 65వ ల్యాప్‌లో వైదొలిగాడు. మరో ఫోర్స్ డ్రైవర్ పెరెజ్ కూడా రేసును పూర్తి చేయలేకపోయాడు.