
హామిల్టన్‌కే పోల్
మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్‌లో ఐదో పోల్ పోజిషన్ సాధించాడు. శనివారం జరిగిన ఆస్ట్రియన్
‘ఫోర్స్’ హుల్కెన్‌బర్గ్‌కు మూడోస్థానం
ఆస్ట్రియన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్
స్పీల్‌బర్గ్: మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్‌లో ఐదో పోల్ పోజిషన్ సాధించాడు. శనివారం జరిగిన ఆస్ట్రియన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌లో అతను 1:07.922 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో నేడు (ఆదివారం) జరిగే ప్రధాన రేసును ఒకటో స్థానంనుంచి మొదలుపెడతాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్‌లో ఇది 54వ పోల్. మెర్సిడెజ్ మరో డ్రైవర్ నికో రోస్‌బెర్గ్ (1:08.465 సెకన్లు) రెండో స్థానంలో నిలిచాడు. కానీ ప్రాక్టీస్ సెషన్‌లో గేర్ బాక్స్‌ను మార్చుకున్నందుకు అతనిపై ఐదు గ్రిడ్‌ల పెనాల్టీ పడింది.
దీంతో రోస్‌బెర్గ్ ఏడో గ్రిడ్ నుంచి రేసును మొదలుపెడతాడు. మూడో స్థానంలో నిలిచిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ (1:09.285 సెకన్లు) రెండో గ్రిడ్ నుంచి బరిలోకి దిగుతాడు. నాలుగో స్థానం సాధించిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ (1:09.781 సెకన్లు)పై కూడా ఐదు గ్రిడ్‌ల పెనాల్టీ పడటంతో అతను తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. క్వాలిఫయింగ్‌లో ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన బటన్ (మెక్‌లారెన్-1:09.900 సెకన్లు), రైకోనెన్ (ఫెరారీ-1:09.901 సెకన్లు) ఒక్కో స్థానం ముందుకు జరిగారు.
బొటాస్ (విలియమ్స్-1:10.440 సెకన్లు), వెర్‌స్టపెన్ (రెడ్‌బుల్-1:11.153 సెకన్లు), మసా (విలియమ్స్-1:11.977 సెకన్లు)లు క్వాలిఫయింగ్‌లో వరుసగా 8,9,10 స్థానాల్లో నిలిచారు. ట్రాక్ పరిమితులను దాటి డ్రైవ్ చేసిన ఫోర్స్ డ్రైవర్ పెరెజ్‌తో పాటు గుటిరెజ్ (హాస్), పాస్కల్ (మనోర్ రేసింగ్), గ్రోస్‌జీన్ (హాస్), అలోన్సో (మెక్‌లారెన్), సైంజ్ (టోరో రోసో)లు క్వాలిఫయింగ్-2లోనే వెనుదిరిగారు. క్వాలిఫయింగ్-1లో కయాట్ (టోరో రోసో) కారు పెద్ద ప్రమాదానికి గురైంది.