
'హ్యాట్రిక్' సెంచరీలతో వైట్ వాష్!
వెస్టిండీస్ జరిగిన మూడు వన్డేల సిరీస్లో పాకిస్తాన్ బాబర్ అజామ్ అరుదైన మైలురాయిని నమోదు చేశాడు.
అబుదాబి:వెస్టిండీస్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజామ్ అరుదైన మైలురాయిని నమోదు చేశాడు. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా ప్రతీ మ్యాచ్ల్లోనూ శతకాలు చేసిన రెండో ఆటగాడిగా బాబర్ నిలిచాడు. విండీస్ తో జరిగిన మూడో వన్డేలో కూడా బాబర్(117) శతకంతో రాణించి పాక్ సిరీస్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్ తొలి రెండు వన్డేల్లో బాబర్(120, 123) రెండు సెంచరీలతో మెరిశాడు. అంతకుముందు 2013-14 సీజన్లో భారత్ తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లోదక్షిణాఫ్రికా ఆటగాడు డీ కాక్ ఈ ఘనతను సాధించాడు.
బుధవారం రాత్రి జరిగిన చివరి దైన మూడో వన్డేలో పాక్ ఆటగాళ్లు అజర్ అలీ(101)తో పాటు బాబర్ కూడా సెంచరీ సాధించాడు. దాంతో పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన వెస్టిండీస్ 44.0 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్ కావడంతో 136 పరుగుల తేడాతో ఘోర ఓటమి చెందింది. కనీసం చివరి మ్యాచ్లో గెలిచి పరువు నిలపుకుందామని భావించిన విండీస్ కు మరో వైట్ వాష్ తప్పలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన టీ 20 సిరీస్ లో కూడా విండీస్ వైట్ వాష్ అయిన సంగతి తెలిసిందే.