ఇపో (మలేసియా): కొత్త సీజన్‌ను భారత పురుషుల హాకీ జట్టు విజయంతో ప్రారంభించింది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ వార్షిక టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్ భారత్ శుభారంభం చేసింది. జకార్తా ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జపాన్‌తో శనివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2–0 గోల్స్ తేడాతో గెలుపొందింది. భారత్ తరఫున ఆట 24వ నిమిషంలో వరుణ్ కుమార్... 55వ నిమిషంలో సిమ్రన్‌జిత్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. జపాన్‌పై భారత్‌కిది వరుసగా 13వ విజయం కావడం విశేషం. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత్ ఆడుతుంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా 2013లో చివరిసారి జపాన్ చేతిలో ఓడిన భారత్ ఈ టోర్నీలో చీఫ్ కోచ్, పలువురు సీనియర్ ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగింది. గతేడాది జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచి సంచలనం సృష్టించిన జపాన్‌ను ఏ దశలోనూ తేలిగ్గా తీసుకోని భారత్ ఆరంభం నుంచే ఓ ప్రణాళిక ప్రకారం ఆడింది.
తొలి క్వార్టర్‌లో ఖాతా తెరవని భారత్‌కు రెండో క్వార్టర్‌లో లభించిన పెనాల్టీ కార్నర్‌ను వరుణ్ కుమార్ డ్రాగ్ ఫ్లిక్‌తో బంతిని లక్ష్యానికి చేర్చాడు. అనంతరం మన్‌ప్రీత్ సింగ్, కొతాజిత్ సింగ్ మిడ్ ఫీల్డ్‌లో మంచి సమన్వయంతో ముందుకు దూసుకెళుతూ ఫార్వర్డ్ ఆటగాళ్లకు పలుమార్లు గోల్ చేసే అవకాశాలు సృష్టించారు. అయితే ఫినిషింగ్ లోపంతో భారత్ ఈ అవకాశాలను వృథా చేసుకుంది. 33వ నిమిషంలో జపాన్‌కు తొలి పెనాల్టీ కార్నర్ లభించగా... భారత గోల్‌కీపర్ శ్రీజేశ్ దానిని సమర్థంగా అడ్డుకున్నాడు. ఇక ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా జపాన్ తమ గోల్‌కీపర్‌ను తప్పించి అదనపు ఆటగాడితో ఆడింది. ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకుంది. మన్‌దీప్ అందించిన పాస్‌ను ‘డి’ సర్కిల్‌లో సిమ్రన్‌జిత్ సింగ్ డైవ్ చేస్తూ బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు.
భారత్ శుభారంభం
Published Sun, Mar 24 2019 1:16 AM | Last Updated on Sun, Mar 24 2019 1:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment