దక్షిణాఫ్రికా ఎదురీత
♦ లక్ష్యం 416
♦ ప్రస్తుతం 136/4
♦ ఇంగ్లండ్‌తో తొలి టెస్టు
డర్బన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు ఎదురీదుతోంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 416 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 47 ఓవర్లలో 4 వికెట్లకు 136 పరుగులు చేసింది. డివిలియర్స్ (37 బ్యాటింగ్), స్టెయిన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్ ఎల్గర్ (40) రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. వాన్‌జెల్ (33)తో తొలి వికెట్‌కు 53; ఆమ్లా (12)తో రెండో వికెట్‌కు 32 పరుగులు జోడించాడు. అయితే ఫిన్ వరుస ఓవర్లలో ఆమ్లా, ఎల్గర్‌ను అవుట్ చేయడంతో సఫారీ జట్టు 88 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో డివిలియర్స్, డు ఫ్లెసిస్ (9) నాలుగో వికెట్‌కు 48 పరుగులు జత చేసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఫిన్ 3 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఇంకా 280 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 172/3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 102.1 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. రూట్ (73), టేలర్ (42), బెయిర్‌స్టో (79) నిలకడగా ఆడారు. పీట్ 5 వికెట్లు తీశాడు.