ఉత్కంఠ పోరులో గట్టెక్కిన దక్షిణాఫ్రికా
హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో గెలిచిన దక్షిణాఫ్రికా... ఐదు వన్డేల సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 1–0 ఆధిక్యాన్ని సంపాదించింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. విలియమ్సన్ (59; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), గ్రాండ్‌హోమ్ (34 నాటౌట్; 3 సిక్స్‌లు), సౌతీ (24 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా ఆడారు. సఫారీ బౌలర్లలో మోరిస్ 4 వికెట్లు తీశాడు.
అనంతరం దక్షిణాఫ్రికా 33.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు డి కాక్ (69; 9 ఫోర్లు, ఒక సిక్స్), ఆమ్లా (35; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 88 పరుగులు జోడించారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తడబడింది. 156 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ డివిలియర్స్ (34 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు), ఫిలుక్‌వాయో (23 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఏడో వికెట్‌కు అజేయంగా 54 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించారు. చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 12 పరుగులు అవసరంకాగా... సౌతీ వేసిన ఈ ఓవర్ రెండో బంతికి ఫిలుక్‌వాయో సిక్సర్ కొట్టగా... ఐదో బంతికి డివిలియర్స్ ఫోర్ కొట్టి విజయాన్ని ఖాయం చేశారు. ఈ గెలుపుతో వన్డేల్లో అత్యధికంగా వరుసగా 12 విజయాలు సాధించిన రెండో జట్టుగా తమ పేరిటే ఉన్న రికార్డును దక్షిణాఫ్రికా సమం చేసింది.