గప్టిల్ 180 నాటౌట్
15 ఫోర్లు, 11 సిక్సర్లతో చెలరేగిన బ్యాట్స్‌మన్
దక్షిణాఫ్రికాపై కివీస్ విజయం
హామిల్టన్: న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గాయంతో దాదాపు నెల రోజుల పాటు ఆటకు దూరమైన ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ పునరాగమనంలో దక్షిణాఫ్రికాను వణికించాడు. గప్టిల్ (138 బంతుల్లో 180 నాటౌట్; 15 ఫోర్లు, 11 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో బుధవారం ఇక్కడ జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (67; 4 ఫోర్లు), ఆమ్లా (40; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఆ జట్టు ఒక దశలో 128/2తో మెరుగైన స్థితిలో నిలిచింది. అనంతరం 30 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (59 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అనంతరం న్యూజిలాండ్ 45 ఓవర్లలో 3 వికెట్లకు 280 పరుగులు చేసి గెలిచింది. గప్టిల్, రాస్ టేలర్ (97 బంతుల్లో 66; 7 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 180 పరుగులు జోడించడం విశేషం.
ఘనమైన బ్యాటింగ్...: భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలో జాగ్రత్తగా ఆడుతూ గప్టిల్ తొలి 11 బంతుల్లో 2 పరుగులే చేశాడు. ఆ తర్వాత చెలరేగిపోయిన అతను 9 బంతుల వ్యవధిలో 2 సిక్సర్లు, 3 ఫోర్లు బాది 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 62 పరుగుల వద్ద ప్రిటోరియస్ బౌలింగ్‌లో అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించినా, రివ్యూలో అది నాటౌట్‌గా తేలడంతో గప్టిల్ బతికిపోయాడు. కొద్ది సేపటి తర్వాత మోరిస్ బౌలింగ్‌లో సింగిల్ తీసి గప్టిల్ 82 బంతుల్లోనే వన్డేల్లో తన 12వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. టేలర్ అండతో చివర్లో మరింత చెలరేగిపోయిన గప్టిల్, 45వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాది కివీస్‌ను గెలిపించాడు. గప్టిల్ కొట్టిన 11 సిక్సర్లలో 4 సెడెన్ పార్క్ బయట పడ్డాయి. తాహిర్ బౌలింగ్‌లోనే అతను ఐదు సిక్సర్లు బాదడం విశేషం. తాజా ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. చివరి వన్డే శనివారం ఆక్లాండ్‌లో జరుగుతుంది.
► కివీస్ తరఫున ఇది (180 నాటౌట్) మూడో అత్యధిక స్కోరు కాగా... మొదటి రెండు (237 నాటౌట్, 189 నాటౌట్) కూడా గప్టిల్ పేరిటే ఉన్నాయి. కనీసం 180 కంటే ఎక్కువ పరుగులు మూడు సార్లు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ కూడా గప్టిల్ కావడం విశేషం.
► వన్డేల్లో తొలి ఇన్నింగ్స్‌లో రెండు వైపుల నుంచి స్పిన్నర్‌తో బౌలింగ్ ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఈ వన్డేలో కివీస్ స్పిన్నర్లు జీతన్, సాన్‌ట్నర్ కొత్త బంతితో బౌలింగ్ చేశారు.