భారీ శతకం.. గప్టిల్ ఖాతాలో అరుదైన రికార్డులు
హామిల్టన్: న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా గప్టిల్ అజేయ శతకంతో చెలరేగడంతో 7 వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 279 పరుగులు చేసింది. కెప్టెన్ డివిలియర్స్(72), డుప్లిసెస్(67) లు హాఫ్ సెంచరీలు చేయగా, ఓపెనర్ ఆమ్లా(40) రాణించాడు. 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఓపెనర్ బ్రౌన్ లై(4) వికెట్ ను త్వరగా కోల్పోయింది.
మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 138 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్సర్లతో 180 పరుగులు చేసి చివరి వరకూ నిలిచాడు. ఈ క్రమంలో రెండు రికార్డులను తనఖాతాలో వేసుకున్నాడు. ఛేజింగ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో గప్టిల్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఛేజింగ్‌లో అత్యదిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో షేన్ వాట్సన్ (185 నాటౌట్), ధోనీ(183 నాటౌట్), కోహ్లీ(183)ల తర్వాత స్థానం గప్తిల్(180 నాటౌట్)దే. రెండవ ఇన్నింగ్స్‌లో వ్యక్తిగతంగా అత్యధిక రన్స్ చేసిన న్యూజిలాండ్ క్రికెటర్ గా గప్టిల్ ఖాతాలో మరో రికార్డు నమోదైంది.
ఓపెనర్ బ్రౌన్‌లీ(4) ఔటయ్యాక కెప్టెన్ విలియమ్సన్ (21)తో కలిసి రెండో వికెట్ కు 72 పరుగులు జోడించాడు గప్టిల్. విలియమ్సన్ ఔటయ్యాక క్రీజులోకొచ్చిన టేలర్‌తో కలిసి పరుగుల సునామీ సృష్టించాడు. టేలర్ హాఫ్ సెంచరీ(66 : 7 ఫోర్లు, 1 సిక్సర్)తో రాణించాడు. టేలర్, గప్టిల్ మూడో వికెట్ కు 180 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. గప్టిల్ సిక్సర్లు, ఫోర్లతో చేలరేగడంతో మరో 30 బంతులు మిగిలుండగానే మూడు వికెట్లు కోల్పోయి కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. నాలుగో వన్డే గెలుపుతో సిరీస్ 2-2 తో సమమైంది. నిర్ణయాత్మకమైన చివరి వన్డే ఈ నెల 4న ఆక్లాండ్‌లో జరుగుతుంది.